కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్-1లో జాగ్రఫీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో విశ్లేషణ ఇవ్వండి?
-పి.శ్రీవాణి, విద్యానగర్
గతంలో కంటే 2013లో జాగ్రఫీ, పర్యావరణం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈ విభాగాల నుంచి 27 ప్రశ్నలు అడిగారు. వర్తమాన అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రాలేదు. బేసిక్స్ అంశాలపై కచ్చితమైన అవగాహన ఉన్నవారు, లాంగ్‌టర్మ్ ప్రిపరేషన్ ఉన్నవారు మాత్రమే సమాధానాలు గుర్తించేలా ఉన్నాయి.
2013లో వచ్చిన ప్రశ్నలు రెండు విధాలుగా ఉన్నాయి. 1. పర్యావరణానికి సంబంధించిన బేసిక్ అంశాలు. 2. పర్యావరణంతో ముడిపడిన జాగ్రఫీ అంశాలు. విపత్తు నిర్వహణపై ఎలాంటి ప్రశ్నలు రాలేదు.2013లో వర్తమాన అంశాలకు సంబంధించి ప్రశ్నలు రానంత మాత్రాన ఈసారి ఇలాగే ఉంటుందని చెప్పలేం. తప్పనిసరిగా సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ జాగ్రఫీని చదవాల్సిందే.
ఇన్‌పుట్స్: గురజాల శ్రీనివాసరావు(జాగ్రఫీ), సీనియర్ ఫ్యాకల్టీ
బ్యాంక్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షల్లో జనరల్ ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే ఏయే అంశాలపై పట్టు సాధించాలి?
- ఎం.మాధవి, మధురానగర్
బ్యాంక్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వేస్ వంటి పరీక్షల్లో తప్పనిసరి విభాగం జనరల్ ఇంగ్లిష్. ఇవేకాకుండా దేశవ్యాప్తంగా జరిగే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లోనూ జనరల్ ఇంగ్లిష్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. ఇంగ్లిష్‌లో ముఖ్యంగా.. గ్రామర్, వొకాబ్యులరీ, అసంపూర్ణంగా ఉన్న వాక్యాలను పూరించడం, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, కాంప్రహెన్షన్ ఆఫ్ ప్యాసేజ్, తప్పులను గుర్తించడం, ఖాళీలను పూరించడం, ప్రిపోజిషన్స్, జాతీయాలు/సామెతలు, అక్షర దోషాలు, పదాలను సరైన క్రమంలో అమర్చడం వంటివాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే ఏకైక మార్గం.. వీలైనంత మేర సిలబస్‌లోని అన్ని అంశాలను ప్రాక్టీస్ చేయడం. ముందుగా మీరు ఏ పరీక్ష అయితే రాయాలనుకుంటున్నారో ఆ పరీక్షకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను సేకరించి.. ప్రశ్నల సరళిని పరిశీలించాలి. ఏయే అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో గమనించాలి. తర్వాత వాటిని సాధన చేయాలి. వివిధ వెబ్‌పోర్టల్స్ అందించే ఆన్‌లైన్ మాక్ టెస్టులను రాయాలి. దీనివల్ల పరీక్షల ముందు మీకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం, టీవీలో వార్తలు చూడటం వల్ల వాక్య నిర్మాణం, స్పెల్లింగ్ వంటి అంశాలు తెలుస్తాయి. అదేవిధంగా రెన్ అండ్ మార్టిన్.. హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ బుక్ ఇంగ్లిష్‌లో ప్రాథమిక అంశాలను, గ్రామర్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటితోపాటు మ్యాగజైన్లు, ఇతర మాధ్యమాల ద్వారా మోడల్ పేపర్లను సాధన చేయాలి. అందుబాటులో ఉన్న సమయంలో వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తే జనరల్ ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించొచ్చు.
రిఫరెన్స్ బుక్స్:
ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్ - ఆర్‌ఎస్ అగర్వాల్, వికాస్ అగర్వాల్ (ఎస్.చంద్ ప్రచురణ)
ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ - హరిమోహన్ ప్రసాద్, ఉమారాణి సిన్హా (టాటా మెక్‌గ్రాహిల్ ఎడ్యుకేషన్ ప్రచురణ)
ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ ఫోర్త్ ఎడిషన్ - ఎడ్గర్ థోర్ప్ (పియర్‌సన్ ప్రచురణ)
ఇన్‌పుట్స్: కె. లలితాబాయ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లిష్, హైదరాబాద్.