మమ!
- పేరుకే ‘మెదక్ జిల్లా’..
- నాడు రెవెన్యూ డివిజన్‌లో 18 మండలాలు
- నేడు జిల్లా రూపమిచ్చినా.. 14 మండలాలే!
- జిల్లాల పునర్విభజనలో మెదక్‌కు అన్యాయం
- ఒకే ఒక్క నియోజకవర్గంతో సరిపెట్టారు!
- ఇతర జిల్లాల్లోకి సమీప మండలాలు
ఇదీ మెదక్ జిల్లా స్వరూపం
మెదక్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల నుంచి కలిసిన మండలాల వివరాలిలా ఉన్నాయి.
మెదక్: మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట (ఇదొక్కటే మెదక్ జిల్లాలోని మండలాలతో ఉన్న నియోజకవర్గం)
నర్సాపూర్: కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, శివ్వంపేట
గజ్వేల్: తూప్రాన్
దుబ్బాక: చేగుంట
నారాయణఖేడ్: పెద్దశంకరంపేట, రేగోడ్
ఆందోలు: టేక్మాల్, అల్లాదుర్గం
మెదక్:ప్రజాభీష్టం మేరకే జిల్లాలను ఏర్పాటు చేస్తామన్న పాలకులు.. ఇష్టారీతిన జిల్లాను విభజించి మెదక్‌ను 14 మండలాలకే పరిమితం చేశారు. 18 మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మెదక్‌ను.. జిల్లాగా చేసి 14 మండలాలే మిగల్చడంపై ఈ ప్రాంత వాసుల్లో ఆవేదనను కలిగిస్తోంది. సంగారెడ్డి నూతన జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా, సిద్దిపేటకు నాలుగు పూర్తిస్థాయి నియోజకవర్గాలున్నాయి.
మెదక్ జిల్లాలో మాత్రం కేవలం ఒకేఒక్క పూర్తిస్థాయినియోజకవర్గం ఉండగా, మిగతా నియోజకవర్గాల నుంచి పది మండలాలను వేరుచేసి మెదక్‌లో కలిపారు. ఈ విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రం నుంచి మండలాలకు ఉండే దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని..విభజన చేయాల్సి ఉండగా మెదక్ విషయంలో అది జరగలేదన్న విమర్శలున్నాయి. మెదక్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నాగిరెడ్డిపేట, నర్సాపూర్, నారాయణఖేడ్ మండలాలను మెదక్‌లో కలిపేందుకు అవకాశమున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు.
జిల్లా కేంద్రం కోసం పోరాటం
ఒకప్పుడు మెదక్ నాలుగు జిల్లాలకు సుభాగా ఉండేదని, ఇక్కడి నుంచే పాలన కొనసాగేదని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక జిల్లా కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.
చివరకు ఒకే నియోజకవర్గంతో కూడిన జిల్లా ఏ ర్పాటు కావడంపై వారంతా ఆవేదన చెందుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జి ల్లా ఒకచోట, జిల్లా కేంద్రం మరోచోట ఉం దంటే అది ఒక్క మెదక్‌లోనే! దీంతో ఈ ప్రాం తం అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైంది. నాటి పాలకులు జిల్లా కేంద్రాన్ని సంగారెడ్డికి తరలించి, హైదరాబాద్‌లో ఉంటూ పాలన కొనసాగించారు. కాగా, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్న సమయంలోనూ ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక జిల్లా కోసం ఆందోళనలు నిర్వహించారు.
జిల్లాకు అన్యాయం
ఒక నియోజకవర్గంతో పాటు 10 మండలాలను కలిపి మెదక్ కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు అతి సమీపంలో ఉన్న మండలాలను సైతం పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. మెదక్ మండలంలో 35 గ్రామ పంచాయతీలు, 12 మధిర గ్రామాలు, 21 గిరిజన తండాలున్నాయి.
మెదక్ డివిజన్‌లోనే ఇది అతిపెద్ద మండలం. కాగా, జిల్లా విభజన ప్రారంభం కాగానే మెదక్ మండలంలోని హవేళిఘణాపూర్‌ను మండలకేంద్రంగా ప్రకటిస్తారని ఈ ప్రాంత ప్రజలు భావించారు. అదీ జరగలేదు. అంతేకాకుండా నర్సాపూర్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలోనే ఉంచాలని, అక్కడి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సైతం కోరుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల ప్రజలు సైతం తమ మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి నర్సాపూర్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్‌లో కలిపితేనే ఈ ప్రాంతానికి ఒక భౌగోళిక స్వరూపం వస్తుంది.
ప్రయోజనం శూన్యం
14 మండలాలతో మెదక్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడమంటే ఈ ప్రాంత ప్రజలను అవమాన పర్చినట్టే. ఎలాంటి అభివృద్ధి వనరులు ఈ 14 మండలాల్లో లేవు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు నాగిరెడ్డిపేట మండలాలన్ని కలపాల్సిన అవసరం ఉంది.
– హర్కార్ మహిపాల్, మ్యాప్స్ అధ్యక్షుడు, మెదక్
అశాస్త్రీయ ఏర్పాటు
మెదక్ జిల్లా ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను ఆయా జిల్లాల్లోనే ఉంచుతామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అదీ అమలు కాలేదు. శాస్త్రీయ ప్రకారమే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
– అస్త్రగల్ల బాలరాజ్, ఎంవైఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్