‘అవార్డులపై శ్రద్ధ...సమస్యలపై లేదు’
హైదరాబాద్: చిన్నపాటి వర్షానికే గ్రేటర్ హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారుతోందని, మంత్రి కేటీఆర్‌కు ఈ విషయం కనబడటం లేదా అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్న కేసీఆర్, కేటీఆర్ మాటలు ఎటు పోయాయి అని నిలదీశారు. కేటీఆర్‌కు అవార్డులు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ.. సమస్యల పరిష్కారంపై లేదని దుయ్యబట్టారు. మంత్రి కేటీఆర్ గాలిమాటలు మాని, పరిష్కారాలపై దృష్టి పెట్టాలని కోరారు.
సీఎం కేసీఆర్‌కు ధైర్యం ఉంటే అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు. ఒక్క నల్లగొండే కాదు ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో అప్పుడు తెలుస్తుందని అన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను అన్న ప్రధానమంత్రి మోదీ... డీజిల్ ,పెట్రోల్‌పై వేర్వేరుగా జీఎస్టీ ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు.