ఫిల్మ్ నగర్ క్లబ్ ఫర్నీచర్ ధ్వంసం
హైదరాబాద్: అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపడుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందడానికి కారణమైన ఫిల్మ్ నగర్ క్లబ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చాంబర్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కే లక్ష్మారెడ్డి వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుతో పాటు యూత్ కాంగ్రెస్ నేత అనిల్, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని.. లేదంటే నిరాహారదీక్ష చేపడుతామని ఆయన హెచ్చరించారు.
ఫిల్మ్ నగర్ ఘటనలో మృతులకు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీవైఎస్ఆర్ సీపీ అధ్యక్షడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.