ప్రాజెక్టుల అవినీతి వెనక సీఎం
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణ
♦ ప్రాణహిత అంచనా వ్యయం రెండున్నర రెట్లు పెంచారు
♦ మెదక్ జిల్లా గజ్వేల్‌లో రూ. 3,500 కోట్ల పనులు నామినేషన్‌పైనే కాంట్రాక్టర్లకిచ్చారని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్, టెండర్లు లేకుండానే పనుల అప్పగింత వంటి నిర్ణయాల వెనక జరుగుతున్న అక్రమాల్లో సీఎం కేసీఆర్ హస్తముందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, డీకేఅరుణ, జి.చిన్నారెడ్డి తదితరులతో కలసి ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రూ. 38 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందిన ప్రాణహిత ప్రాజెక్టును దాదాపు రెండున్నర రెట్ల మేర రూ.83 వేల కోట్లకు పెంచి వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని ఉత్తమ్ ప్రశ్నించారు.
కేసీఆర్ సొంత నియోజకవర్గమైన మెదక్ జిల్లా గజ్వేల్ లో రూ. 600 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ. 3,500 కోట్లకు పెంచి నామినేషన్‌పైనే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వ వివరణ అడిగేం దుకు స్పీకర్ తమకు ఒక్క నిమిషం కూడా సమయమివ్వకుండా సభను వాయిదా వేయడం అభ్యంతరకరమని చెప్పారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వకుండా సభను వాయిదా వేశారని ఆరోపించారు.
నియంతలా కేసీఆర్ తీరు: జీవన్‌రెడ్డి
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్రకు శాశ్వతంగా తాకట్టుపెట్టేలా ఒప్పందాలు చేసుకుని ఏదో సాధించినట్టుగా సీఎం కేసీఆర్ సంబరాలు చేసుకున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశమున్నా కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు వల్ల మూడు లిఫ్టులు, భారీగా నిర్వహణ వ్యయం శాశ్వతం గా ఉండేలా డిజైన్ చేస్తున్నారని విమర్శిం చారు. దీనిపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెచ్చుకున్న సంతోషం, అభివృద్ధి లేకుండా కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికే బంగారు తెలంగాణ అని, దీనిని దోపిడీ చేయడానికి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. కేవలం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే 95 శాతం పూర్తయిన ప్రాజెక్టులతో లక్ష ఎకరాలకుపైగా కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని...కానీ కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తిపడి తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బకొట్టేలా ప్రాజెక్టులకు డిజైన్లు మారుస్తున్నారని అరుణ ఆరోపించారు.