హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే అంశంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి...కొత్త భవనాన్ని నిర్మించాలని యోచిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జీవన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
కాగా వాస్తు దోషం ఉందనే సాకుతో విశాలమైన, పటిష్టమైన సచివాలయ భవనాలను కూల్చేయవద్దంటూ జీవన్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. అమరావతికి ఆంధ్రా సచివాలయం తరలివెళ్తున్న నేపథ్యంలో తెలంగాణకు మరో నాలుగు బ్లాకులు పెరుగుతాయని, దీనివల్ల సువిశాలమైన సదుపాయాలు, వసతులున్న సచివాలయం అందుబాటులో ఉంటుందన్నారు. వాస్తుదోషం కారణంతో సచివాలయాన్ని కూల్చేసి, కొత్తది నిర్మించాలనే ప్రతిపాదన వల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతుందన్నారు.
మరోవైపు కొత్త సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మంచి రోజులు రాగానే.. ఆగస్టులో ఈ పనులకు ముహూర్తంగా ఎంచుకున్నట్లు అధికార వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది వ్యవధిలోకొత్త భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టేంతవరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం తలెత్తకుండా చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
టీ.సచివాలయం కూల్చొద్దంటూ పిటిషన్
Published Thu, Oct 27 2016 12:26 PM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM
Advertisement