
ఏకే47 మిస్‌ఫైర్... కానిస్టేబుల్ మృతి
ఆక్టోపస్ కార్యాలయంలో ఘటన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఉగ్రవాద వ్యతిరేక కమాండో విభాగం (ఆక్టోపస్) కార్యాలయంలో ఆదివారం మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శివకుమార్ అక్కడికక్కడే మృతి చెం దాడు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన శివకుమార్ (24) 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్. ప్రస్తుతం టీఎస్‌ఎస్‌పీ 13వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా డిప్యుటేషన్‌పై గ్రీన్‌ల్యాం డ్స్‌లో ఉన్న ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో సెం ట్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతం లో విధులు ముగించుకున్న శివకుమార్ తన వద్దనున్న ఏకే-47 (.9ఎంఎం) పిస్టల్‌ను శుభ్రం చేసేందుకు ఉపక్రమించాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి గెడ్డం కింది నుంచి తూటా దూసుకుపోయి, తల భాగం నుంచి బయటకు వచ్చింది. తుపాకీ శబ్దంతో అక్కడి చేరుకున్న సహోద్యోగులు అతడిని యశోదా ఆసుపత్రికి తరలిం చగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపా రు. మృతదేహాన్ని నిమ్స్ మార్చురీలో ఉంచారు. ఆక్టోపస్ అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆక్టోపస్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.