కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
11,281 పోస్టులకుగాను 10,113 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. సివిల్, ఏఆర్, బెటాలియన్స్, ఎస్పీఎఫ్, ఫైర్‌మెన్ విభాగాల్లోని 11,281 పోస్టులకుగాను 10,113 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు తెలిపారు. ఇక వారం రోజుల క్రితం పోలీస్ కమ్యూనికేషన్ విభాగం లోని 332 పోస్టులకు జరిగిన నియామక ప్రక్రియలో 329 మంది ఎంపికయ్యారు. దాంతో మొత్తం 11,613 పోస్టులకుగాను.. 10,442 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్టు వెల్లడించారు. కటాఫ్ మార్కులు, కేటగిరీల వారి ఎంపిక వివరాలను అధికారిక వెబ్‌సైట్ www. tslprb.inలో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 20న వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
(పూర్తి ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి)
ఈ నోటిఫికేషన్‌లో సివిల్ విభాగంలో 33 శాతం మహిళా రిజర్వేషన్ ద్వారా 637 మంది, ఏఆర్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్ ద్వారా 387మంది, కమ్యూని కేషన్ విభాగంలో 106 మంది... మొత్తంగా 1,130 మంది మహిళా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని వెల్లడించారు. రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ధారించిన కటాఫ్ మేరకు మార్కులు రాకపోవడం, ఆయా రిజర్వేషన్లకు సంబంధించి కటాఫ్ మార్కులు, ఇతరత్రా అంశాల కారణంగా సుమారు వెయ్యికిపైగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మార్చి రెండో వారంలో శిక్షణ!
కానిస్టేబుల్ తదితర పోస్టుల నోటిఫికేషన్ తుది ఫలితాలు విడుదలైన నేపథ్యంలో.. ఎంపికైన అభ్యర్థులపై స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ విభాగాల ఎంక్వైరీ ఉంటుంది. 10,442 మంది అభ్యర్థులకు సంబంధించిన ఏదైనా నేరచరిత్ర ఉందా.. ఉంటే ఎలాంటి కేసుల్లో ఉంది, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి, ఎంపికైన అభ్యర్థి వ్యక్తిత్వం, స్వభావం తదితర అంశాలపై పూర్తి నివేదికలను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియకు మూడు నాలుగు వారాలు పట్టే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో మార్చి మొదటి లేదా రెండో వారం తర్వాత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశముందని తెలిసింది. ఎంపికైన వారికి తొమ్మిది నెలల పాటు అకాడమీ, ట్రైనింగ్ కాలేజీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
త్వరలోనే ఎస్సై ఫలితాలు: కానిస్టేబుల్ పరీక్షల తుది ఫలితాలు విడుదల వడంతో ఎస్సై అభ్యర్థుల్లోనూ ఉత్సాహం మొదలైంది. 530 ఎస్సై పోస్టులు, 9 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు మరో వారం పది రోజుల్లో విడుదల వుతాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఒకేసారి శిక్షణ కార్యక్రమా లు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఫలితాలపై సీఎం కేసీఆర్ హర్షం
రాష్ట్రంలో భారీ స్థాయిలో నియామకాల ప్రక్రియను పోలీస్ శాఖ పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 10,442 మందికి ఒకేసారి ఉద్యోగాలు కల్పించడంలో పోలీస్ శాఖ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. 1,130 మంది మహిళా అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖను సీఎం అభినందించారు.