కాంట్రాక్టు వ్యవస్థే పెద్ద దోపిడీ
♦ కార్మికుల జీతాలను వాళ్లు సగం వీళ్లు సగం పంచుకుంటున్నారు
♦ పనిచేసే కార్మికులకే నేరుగా జీతాలు వెళ్లాలి
♦ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ డైరీ ఆవిష్కరణలో కోదండరాం, హరగోపాల్
♦ దశలవారీగా డిమాండ్లను పరిష్కరిస్తాం: ట్రాన్స్‌కో సీఎండీ
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థే పెద్ద దోపిడీ వ్యవస్థ. ప్రాణాలను పణంగా పెట్టి కాంట్రాక్టు కార్మికులు కష్టపడుతుంటేనే గ్రామగ్రామానికి కరెంటు వెళ్తోంది. కార్మికుల జీతాలను మాత్రం వాళ్లు సగం వీళ్లు సగం పంచుకుంటున్నారు. ఇంకెంత కాలం ఈ వ్యవస్థ కొనసాగుతుంది? పనిచేసే కార్మికుల జీతాలు నేరుగా వారికే వెళ్లాలి. దళారుల వ్యవస్థ పోవాలి’’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు కార్మికులు కోరడంలో న్యాయం ఉందన్నారు.
బుధవారం మింట్ కాంపౌండ్‌లో జరిగిన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పోరాటాలకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణ కాదు.. మానవీయ తెలంగాణను నిర్మించాలని ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. ప్రతి మనిషి బతకడానికి సరిపడా జీతం ఉండాలని .. అప్పుడే తెలంగాణ వచ్చినందకు సార్థకత వస్తుందన్నారు. దశల వారీగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. కష్టపడి పనిచేయడంలో కాంట్రాక్టు కార్మికులు ముందుంటారన్నారు.
మా ప్రాణాలు చులకనయ్యాయి!
‘‘కరెంటు తీగల మధ్య కాకుల్లా పనిచేస్తున్నాం. నిత్యం కార్మికులు ప్రమాదాలకు లోనై మరణిస్తున్నారు. శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నారు. మా ప్రాణాలు చులకనగా మారాయి. వచ్చే అరకొర జీతాలను దళారులే దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్ల కమీషన్లు పోగా వచ్చే డబ్బుతో మా ఇళ్లు గడవడం లేదు. ప్రభుత్వం మా గోసను పట్టించుకోవడం లేదు’’ అని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జీవితాలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మరింత దుర్భరంగా మారాయని వాపోయారు.
2015లో రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 28-30 మంది కార్మికులు విధి నిర్వహణలో మృత్యువాత పడ్డారని, మరో 30 మంది వికలాంగులుగా మారారని చెప్పారు. తక్షణమే విద్యుత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, దళారులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే కార్మికులకు జీతాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, వెంకటనారాయణ, యూనియన్ కార్యదర్శి సాయిలు, పవర్ ఇంజనీర్ అసోసియేషన్స్ అధ్యక్షుడు సుధాకర్, 1104 యూనియన్ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, 327 యూనియన్ నేత రామకృష్ణ, సీఐటీయూ నేత కిరణ్ తదితరులు పాల్గొన్నారు.