హైకోర్టును పోస్టాఫీస్ చేస్తున్నారు
అధికారుల తీరుపై హైకోర్టు ఆక్షేపణ
సాక్షి, హైదరాబాద్: అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించకుండా హైకోర్టును పోస్టాఫీస్ చేస్తున్నారని, అధికారులు చేయాల్సిన పనుల్ని కూడా తామే చేయాల్సి వస్తోందని ఆక్షేపించింది. హైకోర్టును ఏర్పాటు చేసింది ప్రభుత్వ శాఖలు నిర్వర్తించే ప్రతి పనినీ పర్యవేక్షించేందుకు కాదని తేల్చిచెప్పింది. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు పౌరులు సమర్పించే వినతిపత్రాలు, దరఖాస్తులను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖల్లో అమలు చేయాలని, ఇందుకు అంతర్గతంగా ఓ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల తీర్పు వెలువరించారు. లీజు గడువు ఇంకా ఉన్నప్పటికీ ఎలాంటి కారణాలు చెప్పకుండానే గ్రానైట్ రవాణాకు పర్మిట్లు జారీ చేసేందుకు గనుల శాఖ అధికారులు నిరాకరించారంటూ జయరంగ సాయి గ్రానైట్స్(కర్నూలు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ జరిపారు. ఎందుకు కారణాలు చెప్పలేదో వివరించాలని గనుల శాఖ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ‘సమస్యల పరిష్కారానికి పౌరులు సమర్పించే వినతిపత్రాలు, దరఖాస్తుల విషయంలో అధికారులు సకాలంలో స్పందించడం లేదు.
తిరస్కరిస్తున్న వాటి విషయంలో కారణాలు చెప్పడం లేదు. దీంతో వారంతా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. పౌరుల సమస్యలను పరిష్కరించేందుకు అంతర్గత వ్యవస్థ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. అధికారులు తమ తీరు వల్ల హైకోర్టును పోస్టాఫీసు చేస్తున్నారు’ అని జస్టిస్ కోదండరామ్ తన తీర్పులో పేర్కొన్నారు.