సీఎం చంద్రబాబు ఏదో ఒకటి తేల్చుకోవాలని సీపీఐ నారాయణ డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీతో అధికారం పంచుకొని కులుకుతూ ఎంజాయ్ చేస్తూ రాష్ట్రానికీ, ప్రజలకు మూడు నామాలు పెట్టాలనుకుంటున్నారా? అని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె. నారాయణ ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె. రామకృష్ణతో కలిసి శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘ హోదా విషయంలో టీడీపీ అవకాశవాదాన్ని మనం చూడాలి. ఒకరికొకరు పదవులు పంచుకుంటారు. దాంట్లో ఉన్న తేనేను బాగా రుచి చూస్తారు. పిప్పిని మాత్రం ప్రజల ముఖాన పడేస్తారని సీపీఐ నారాయణ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బీజేపీతో కలిసి నిలబడాలనుకుంటే ప్రత్యేక హోదా తెప్పించండి తీసుకరాకపోతే రాష్ట్రప్రజలను మోసం చేసిన వారవుతారని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మూడు కోతుల కథ మాదిరి ఒకరు చూడవద్దంటారు, ఇంకొకరు వినవద్దంటారు, మరొకరు మాట్లాడొద్దంటారని నారాయణ అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్యనాయుడు పట్టుబట్టారని.. ఈ రోజు ఆ పార్టీ ఇవ్వమని అంటుందని తప్పుబట్టారు. ఇప్పుడు మాట మార్చడానికి వెంచయ్యనాయుడుది నాలుకా, తాటి మట్టా అని ప్రశ్నించారు. హోదా విషయంలో కేంద్రాన్ని ఒప్పించని పక్షంలో వెంకయ్య రాజీనామా చేసి ప్రజలతో కలిసి పోరాడాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్రం నుంచి వైదొలగాలన్నారు. లేనిపక్షంలో చంద్రబాబుకు, వెంకయ్యనాయుడులకు తాటాకులు కట్టి ఊరేగించే రోజు వస్తుందని హెచ్చరించారు.
బిచ్చం కాదు, హోదానే కావాలి
ప్రత్యేక హోదా ఇవ్వంగానీ, ఏం కావాలన్న ఇస్తామంటున్నారని.. తెలుగు ప్రజలేమీ వాళ్లను బిచ్చం అడగటంలేదన్నారు. రాజకీయ హక్కుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి 1.43 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని.. వెంకయ్యనాయుడు, మోదీ వాళ్ల అబ్బసొత్తు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పన్నును వాళ్లు కొంత తిని, ప్రజలకు కొంత ఇస్తున్నారని నారాయణ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా అన్నది మోదీ- బాబు ఇద్దరి వ్యవహారంగా బీజేపీ నేతలు వ్యవహరించడం సరైంది కాదని.. తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 17న మోదీతో భేటీ సమయంలో ప్రత్యేకహోదా సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ, ప్రత్యేక హోదా సాధన సమితి హోదా కోసం కేంద్రంతో పోరాడుతన్నట్లు తెలిపారు.