నిర్వాసితుల సమస్యలపై సీపీఎం పోరు
జూలై 1 నుంచి మల్లన్నసాగర్ పరిధిలో తమ్మినేని పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టు నిర్వాసితులు, పోడు భూములు, డబుల్ బెడ్‌రూం, ఇంటిస్థలం సమస్యలతో పాటు రాష్ర్టవ్యాప్తంగా జిల్లాల్లో స్థానికంగా ఉన్న సమస్యలపై ఉద్యమించాలని సీపీఎం నిర్ణయించింది. మెదక్‌జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్య, ఖమ్మం జిల్లాలో పోడుభూముల నుంచి గిరిజన రైతులను వెళ్లగొట్టడం, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చేపడుతున్న ఆయా రోడ్లు, ఇతర ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులుగా మారుతున్న వారి సమస్యలపై ప్రస్తుతం సాగిస్తున్న కార్యాచరణను కొనసాగించనుంది. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని, అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తమపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించారు.
‘నిర్వాసితులకు న్యాయం చేయండి-ప్రాజెక్టులు కట్టండి’ అనే నినాదంతో నిర్వాసితుల సమస్యలపై వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు సీపీఎం సిద్ధమవుతోంది. మంగళవారం రాత్రి వరకు ఎంబీభవన్‌లో జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. మెదక్ జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యపై జూలై 1న సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ రిజర్వాయర్ పరిధిలో ముంపునకు గురవుతున్న, రైతులు భూములు కోల్పోతున్న గ్రామాల్లో 4వ తేదీ వరకు ఆయనతో పాటు పార్టీ నాయకులు పాదయాత్రలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల పర్వాన్ని ప్రారంభించిందని ఈ సమావేశంలో తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాగానే ఆర్టీసీ, విద్యుత్‌చార్జీలను పెంచి, ఆస్తిపన్ను ఇతర రూపాల్లో సంస్కరణలను సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు. ప్రజల్లో వచ్చే స్పందనను బట్టి ముందుకు సాగాలని, వామపక్షాల ఐక్యతకు, ఆయా అంశాలపై కలసి పనిచేసేందుకు సిద్ధం కావాలని సూచించారు.