మహానగరికి బెంగళూరు పాఠం | cpmpare to benglore and hyderbad city | Sakshi
Sakshi News home page

మహానగరికి బెంగళూరు పాఠం

Published Wed, Jan 27 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

మహానగరికి     బెంగళూరు పాఠం

మహానగరికి బెంగళూరు పాఠం

హైదరాబాద్- బెంగళూరు రెండు మహానగరాలు. ఎన్నో అంశాల్లో రెండింటికీ దగ్గర పోలికలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో పోటీ పడుతున్నాయి. ‘టీ-హబ్’ ఏర్పాటుతో అనేక స్టారప్‌లు ఇటువైపు ఆసక్తి చూపుతున్నాయి. కొద్దికాలంలోనే భాగ్యనగరం ఐటీలో బెంగళూరును అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, అధిక అభివృద్ధి వల్ల బెంగళూరులో తలెత్తిన సమస్యలు పరిష్కరించలేని స్థితి ఏర్పడింది. అలాంటి సమస్యే ఇక్కడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే మేల్కోకుంటే ట్రాఫిక్, మౌలిక సదుపాయాల విషయంలో ‘గ్రేటర్’ మరో బెంగళూరు కాగలదని హెచ్చరిస్తున్నారు.
 - సాక్షి, సిటీబ్యూరో

రెండు నగరాల మధ్య పోలిక..
ఆధునిక బెంగళూరుకు 1537 పునాది పడింది. హైదరాబాద్ కూడా దాదాపు అదే సమయంలో (1592) ఏర్పడింది. బెంగళూరు ఐటీ రంగంలో ముందంజలో ఉంటే హైదరాబాద్ రెండోస్థానంలో ఉంది. ప్రస్తుతం బెంగళూరు మెట్రో జనాభా కోటి పదిహేను లక్షలు. ఈ సంఖ్య 2001లో 51 లక్షలు ఉంటే పద్నాలుగేళ్లలో రెండింతలు దాటింది. హైదరాబాద్ ప్రస్తుత జనాభా దాదాపు కోటి. వాతావరణంలో అనుకూలంతో పాటు, ప్రభుత్వ ప్రోత్సాహంతో బెంగళూరు.. చెన్నై, హైదరాబాద్ కంటే శరవేగంగా అభివృద్ధి చెందింది.
 
భయపెడుతున్న ట్రాఫిక్..
సాఫ్ట్‌వేర్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా రావడంతో బెంగళూరులో ఉద్యోగుల సంఖ్య అమాంతం పెరిగింది. ప్రజల ఆర్థిక స్థాయి సైతం మెరుగుపడింది. వీటివెంటే నగరంలో లక్షల సంఖ్యలో వాహనాలు పెరిగిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్‌లు తప్పనిసరైంది. ఫ్లై ఓవర్లు, వన్ వే పద్ధతి అమలు చేసినా సమస్య అలాగే ఉంది. అభివృద్ధి పేరిట నగరం మొత్తం నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు రోడ్ల విస్తరణ అధికారులకు కత్తిమీద సామైంది. నగరంలో సరిపడినంత స్థలం లేకపోవడంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు శాఖల ఏర్పాటుకు మైసూర్, అనంతపురం వంటి చిన్న పట్టణాలను ఎంచుకుంటున్నాయి.

పెరుగుతున్న వాహనాలు..
ఐటీ, బీపీఓ వంటి ప్రైవేట్ పరిశ్రమలు వందల కొద్దీ బెంగళూరుకు రావడంతో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2015 మార్చిలో55 లక్షల వాహనాలుంటే అక్టోబర్ నాటికి 58 లక్షలకు పెరిగాయి. వీటిలో 12 లక్షలు కార్లు ఉన్నాయి. ప్రతిరోజు 1600 వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. ఒక్కోసారి ఈ సంఖ్య 2 వేలను దాటుతోంది. ఐటీ, దాని అనుబంధ కంపెనీలకు ప్రధాన కేంద్రం కావడంతో ఏటా కొత్తవారు లక్షల సంఖ్యలో నగరంలో స్థిరపడుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగం వల్ల 15 లక్షల వాహనాలు నగరంలో కొత్తగా చేరాయి. వీటి సంఖ్య ఏటా ఏడు నుంచి 10 శాతం పెరుగుతోంది. ప్రతి చదరపు కిలోమీటర్‌కు రోడ్ల విస్తీర్ణం ఢిల్లీలో 21 కి.మీ., హైదరాబాద్‌లో 9.5 కి.మీ. ఉండగా ఇక్కడ 8.2 కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో దాదాపు 30 నిమిషాలు ఆలస్యంగా ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ సమస్యను అధిగమించేందుకు కొన్ని పరిష్కార మార్గాల అమలుకు యత్నిస్తున్నారు. అవి..

► ఎక్కువ శాతం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించడం, బస్సులు, మెట్రోలు, రైళ్లలో ప్రయాణించేలా ప్రోత్సహించడం.
► ఆఫీసుకు, ఇంటికి మధ్య దూరం తక్కువ ఉంటే సైకిల్ వాడడం.
► కంపెనీలు తమ ఉద్యోగులకు క్యాబ్‌లు సమకూర్చడం.
► అవకాశమున్నచోట వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించడం.
► షిఫ్ట్ విధానం అమలు చేయడం
► ఒకే మార్గంలో వెళ్లేవారు ఎవరికివారు సొంత వాహనాల్లో కాకుండా కార్ పూలింగ్ పాటించడం.
 
2012 లెక్కల ప్రకారం బెంగళూరులో ఐటీ, బీపీఓ రంగాల్లో సుమారు 8 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 12 లక్షలకు పైగా ఉంది. రోజు రెండు గంటల సమయం జర్నీ కోసం వెచ్చిస్తున్నారు. సంవత్సరానికి దాదాపు 470 గంటలు రోడ్లపై ట్రాఫిక్‌లోనే గడిపేస్తున్నారు. దీనివల్ల ఆయా సంస్థలకు సుమారు రూ. 33 వేల కోట్లు వృధా అవుతున్నట్టు ఓ సర్వేలో తేల్చారు.
 
ఇక్కడ..  హైదరాబాద్
 
► నగర విస్తీర్ణం 650 చ.కి.మీ.
►జనాభా సుమారు ఒక కోటి
►వాహనాల సంఖ్య 44 లక్షలు
►వాహనాల సగటు వేగం గంటకు 13 కి.మీ.
►{పతిరోజు రిజిస్టర్ అవుతున్న వాహనాలు 750
►నెలకు రిజిస్ట్రేషన్ అవుతున్న వాహనాలు 19,500. వీటిలో కార్లు 4500
►రోడ్ల విస్తీర్ణం (చ.కి.మీ.)  9.5 కి.మీ.
 
 
అక్కడ.. బెంగళూరు
 
► నగరం విస్తీర్ణం 709 చ.కి.మీ.
► జనాభా కోటి 15 లక్షలు
► వాహనాల సంఖ్య 58 లక్షలు (2015 అక్టోబర్)
► వాహనాల సగటు వేగం గంటకు 9.2 కి.మీ.
►{పతిరోజు రిజిస్టర్ అవుతున్న వాహనాలు 1600
► నెలకు కొత్తగా వస్తున్న వాహనాలు దాదాపు 50 వేలు
► రోడ్ల విస్తీర్ణం (చ.కి.మీ.) 8 కి.మీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement