శతావధాని సీవీ సుబ్బన్న కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ప్రొద్దుటూరు కల్చరల్: ప్రముఖ శతావధాని డాక్టర్ కడప వెంకట సుబ్బన్న(88) అనారోగ్యంతో ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరానికి చెందిన సుబ్బన్న కొంతకాలంగా ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పిం చగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం సుబ్బన్న తుదిశ్వాస విడిచారు. కడప రంగమ్మ, చెన్నప్ప దంపతులకు 1929 నవంబర్ 12న సుబ్బన్న జన్మించారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి అవధాన విద్యలో పీహెచ్‌డీ పట్టా పొం దారు. సుబ్బన్న దేశ విదేశాల్లో 600కు పైగా అవధానాలు చేశారు.
తెలుగు భాషాభి వృద్ధికి చేసిన కృషిని గుర్తించి అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి, అప్పటి సీఎంలు దామోదరం సంజీవయ్య, ఎన్టీ రామారావులు సుబ్బన్నను ఘనంగా సత్కరించారు. సుబ్బన్న పదిసార్లు కనకాభిషేకం, హస్తకంకణం, కవి గండపెండేరంతో గౌరవం పొందారు. ఆయన చేసిన అవధానాలను ‘త్రికుఠి’ పేరుతో ముద్రించారు. కాగా, ఆయన పార్థివదేహాన్ని ఆదివారం ప్రొద్దుటూరుకు తరలించారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, సుబ్బన్న మరణం సాహితీ లోకానికి తీరనిలోటని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, జ్ఞానపీఠ్‡ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారా యణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామి రెడ్డి, సీపీఐ నేత కొన పుల్లారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్రనేత గుజ్జుల ఓబులేశ్, ప్రముఖ అవధాని ఆశావాది ప్రకాశ్‌రావు పేర్కొన్నారు.