నిర్లక్ష్యం ఖరీదు.. పసి ప్రాణం
► మండుటెండలతో చిన్నారికి అనారోగ్యం
► ప్రైవేటు ఆస్పత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
► గంటపాటు వైద్యం అందించని వైద్య సిబ్బంది
► మృతదే హంతో నిరసన చేపట్టిన తల్లిదండ్రులు, బంధువులు
మాచర్ల: మండుటెండలకు ఓ చిన్నారి అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని అతడిని ముందుగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. అక్కడ చిన్నారి బతక దని వైద్యులు తెలపడంతో తిరిగి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదిగో ఇదిగో అంటూ గంట సేపు సమయం వృథా చేసి వైద్యులు ఎలాంటి వైద్యం అందించకపోవడంతో చిన్నారి మృతి చెందిన ఘటన శనివారం మాచర్లలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 23వ వార్డులో నివాసం ఉంటున్న షేక్ బాషా, అబ్బాసీ కుమారుడు మహబూబ్‌బాషా (3) చిన్నారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు రామా టాకీస్ లైనులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని చెప్పటంతో ఉదయం 11.45 గంటలకు అక్కడికి తీసుకువెళ్లారు.
వైద్య సిబ్బంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ డాక్టర్ ఇంకా రావాల్సిఉందని 12.45 వరకూ గడిపారు. ఆ తర్వాత వ చ్చిన ఓ వైద్యురాలు చిన్నారి 12.30 గంటలకు చనిపోయాడని చెప్పి ఓపీ చీటీపై రాసి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గంటపాటు వైద్యం అందించకుండా చిన్నారి మృతికి కారణమైన వైద్యురాలిపై బంధువులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రి ముందు ఉంచి నిరసన వ్యక్తం చే శారు.
ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే వైద్యం అందించటం లేదని, వైద్యులు సొంత ఆస్పత్రులకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.