ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
225 ఆస్పత్రుల్లో నిలిచిన వైద్య సేవలు
సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె: ఉద్యోగులు
సమస్యల పరిష్కారం, రెగ్యులరైజేషన్ కోరుతూ ఉద్యోగుల ఆందోళన
సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్‌పడింది. పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన సుమారు 1,800 మంది ఆరోగ్యశ్రీ ఉద్యోగులు సమస్యల పరిష్కారం, రెగ్యులరైజేషన్ కోరుతూ సోమవారం నుంచి విధులు బహిష్కరించి, సమ్మె బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 225 ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయి. తొలి రోజే చాలా ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం అంతటా రాజధానికి వెళ్లాల్సి వచ్చింది.
ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకుందామనుకుని సోమవారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లిన కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన కె.శంకరయ్యకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో ప్రైవేట్‌లో వైద్యం చేయించుకున్నట్లు ఆయన ‘సాక్షి’తో ఫోన్లో ఆవేదన వ్యక్తం చేశాడు. మిగతా జిల్లాల్లోనూ రోగులు గత్యంతరం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకున్నారు. మరోపక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేయడంతో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రశ్నార్థకంగా మారాయి.
అందని వైద్య సేవలు..!
నిరుపేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 55 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ కింద ఉన్నాయి. హైదరాబాద్‌లో 67, కరీంనగర్‌లో 19, ఖమ్మంలో 11, వరంగల్‌లో 26, నిజామాబాద్‌లో 11, మెదక్‌లో 10, మహబూబ్‌నగర్‌లో 12, నల్లగొండలో 9, ఆదిలాబాద్ జిల్లాలో 5 మొత్తం 225 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ కింద ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రుల్లో ప్రతిరోజూ ఆరోగ్యశ్రీ కింద 8 నుంచి 40 మందికి సేవలందుతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాల ఆస్పత్రుల్లో ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ పై ఆధారపడి చికిత్స కోసం చేరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కో ఆరోగ్య మిత్ర విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెండు నుంచి ఆరుగురు చొప్పున ఆరోగ్య మిత్రలు ఉంటారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఒక డివిజనల్ టీం లీడర్, అలాగే ప్రైవేట్ ఆస్పత్రులకు నెట్‌వర్క్ టీం లీడర్ ఆరోగ్యశ్రీ సేవలు పర్యవేక్షిస్తుంటారు. వీరితో పాటు ఆరోగ్య శ్రీ కార్యాలయ సిబ్బంది సేవలు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,800 మంది ఉద్యోగులున్నారు.
సమ్మె.. సమస్యలు..!
పథకం ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలైన ఈ పథకం ఆ మహానేత మరణానంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా రోగులకు ఆశించిన మేరకు సేవలందించలేకపోతోంది. వైఎస్ హయాంలో.. ఆరోగ్య శ్రీ ఉద్యోగులందరికీ రవాణా ఖర్చులు కూడా అందేవి. కానీ, మూడేళ్ల నుంచి ఉద్యోగులకు టీఏలు నిలిపేశారు. ఇదే క్రమంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం ఇవ్వాల్సిన పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు కుటుంబాలు నెట్టుకొస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న ఆరోగ్య మిత్రకు రూ.7,500 వేతనం ఇస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసే ఆరోగ్య మిత్రకు రూ.8,400, డివిజనల్ టీం లీడర్, నెట్‌వర్క్ టీం లీడర్‌కు రూ.12 వేల చొప్పున వేతనాలు అందిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంతో పాటు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ పలు సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించారు. అయినా పట్టించుకోకపోవడంతో సమ్మె బాట పట్టినట్టు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డివిజనల్ టీం లీడర్ సలీముద్దీన్ చెప్పారు.