ఫిరాయింపు నేతలపై వేటు తప్పదు : షబ్బీర్ అలీ
మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ గురువారం అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ఫిరాయించిన ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఇది టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంపపెట్టు వంటిదన్నారు.
పార్లమెంటు సంప్రదాయాలను తుంగలో తొక్కేలా కేసీఆర్ వ్యవహరించిన తీరు దారుణమన్నారు. టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు మొత్తం 25 మందికి నోటీసులు అందాయన్నారు. వీరికి వివరణ ఇచ్చేందుకు మూడు వారాల సమయం ఇచ్చిందని చెప్పారు.