తెరపైకి వికారాబాద్ పోలీస్ జిల్లా!
*‘జీహెచ్‌ఎంసీ పరిధి’కి పరిష్కారమిదే
*శాంతిభద్రతలు ఉండేది సీఎం చేతిలోనే!
*అవసరమైనప్పుడే గవర్నర్ జోక్యం
సాక్షి, సిటీబ్యూరో: ‘జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రతల అంశం గవర్నర్ చేతిలో ఉంటుంది’ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం-2013 బిల్లులో ఉన్న ఓ కీలకాంశమిది. ఇది అమలు కావాలంటే పదేళ్ల క్రితం మరుగున పడిపోయిన వికారాబాద్ పోలీసు జిల్లాను అమలులోకి తేవాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలా కాకుంటే సైబరాబాద్ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని నగరంలో 325 చదరపు కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న హైదరాబాద్, 3600 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న సైబరాబాద్... ఇలా రెండు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణను గవర్నర్‌కు అప్పగించిన నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం గవర్నర్ చేతిలోకే వెళ్తుంది. ఇక్కడ సమస్యల్లా సైబరాబాద్ విషయంలోనే. దీనికి వికారాబాద్ జిల్లా పరిష్కారం కావచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
సగం వరకే ఇక్కడ...
2002లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఏర్పడినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) లేదు. ఈ నేపథ్యంలోనే అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్)లోని ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్‌లో ఉంచిన అధికారులు... దీనికి బయట ఉన్న ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని కొన్నింటిని కలిపి సైబరాబాద్‌గా మార్చారు. జీహెచ్‌ఎంసీ ఏర్పడటంతో వీటి స్వరూప స్వభావాలు మారిపోయాయి. చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలన్నీ విలీనం కావడంతో జీహెచ్‌ఎంసీ విస్తృతమైంది. ఫలితంగా సగం సైబరాబాద్ జీహెచ్‌ఎంసీలో కలిసిపోగా, మిగతా సగభాగం రంగారెడ్డి జిల్లా గ్రామ పంచాయతీల్లో ఉండిపోయింది.
అది ఇప్పుడు అమల్లోకి...
సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తున్న సందర్భంలోనే పోలీసు విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు సైబరాబాద్, అటు రంగారెడ్డి జిల్లాలకు ప్రాంతాలను విభజించిన తరవాత మధ్యలో ఉన్న కొన్నింటితో వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇది రెవెన్యూ పరంగా రంగారెడ్డిలోనే ఉన్నప్పటికీ.. పోలీసు పరంగా ప్రత్యేక జిల్లా. ఇందులో తాండూరు, ఇబ్రహీంపట్నం, మంచాల్ తదితర ప్రాంతాల్ని చేర్చారు. అయితే ఇది అమల్లోకి రాకపోవడంతో ఈ ప్రాంతాల్లో కొన్ని రంగారెడ్డిలో, మరికొన్ని సైబరాబాద్‌లో కలిసిపోయాయి. ప్రస్తుత పరిస్థితిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రతలు గవర్నర్‌కు చేరితే... సైబ రాబాద్‌లో మిగిలిన ప్రాంతాలతోపాటు ఇతరాలతోనూ వికారాబాద్ జిల్లాను కార్యరూపంలోకి తెచ్చే అవకాశముంది.
సవరణ అక్కర్లేకుండానే స్వీకరణ...
విభజన అనంతరం జీహెచ్‌ఎంసీ పరిధిలోని శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ పూర్తిగా తన చేతిలోకి తీసుకోవాలంటే ఎలాంటి రాజ్యాంగ, చట్ట సవరణ అవసరం లేదన్నది మాజీ పోలీసు అధికారుల మాట. శాంతిభద్రతలు రాష్ట్ర జాబితాలోని అంశం. కేంద్రం ఉమ్మడి జాబితాలో ఉన్న వాటితో పాటు రాష్ట్ర జాబితాలో ఉన్న వాటినీ కావాలనుకుంటే ఆదే శాలతో కేంద్ర జాబితాలోకి మార్చుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్‌లో కానీ, సిటీ, సైబరాబాద్ పోలీసు చట్టాల్లో కానీ ఎక్కడా ‘ముఖ్యమంత్రి’ ప్రస్తావన లేని నేపథ్యంలో వీటి సవరణకూ అవసరం రాదని స్పష్టం చేస్తున్నారు.
అన్నింటిలోనూ గవర్నర్ జోక్యం ఉండదు
శాంతిభద్రతల అంశం గవర్నర్‌కు అప్పగించి, కేంద్రం ఇద్దరు ప్రత్యేక అధికారుల్ని నియమించినప్పటికీ దైనందిన కార్యకలాపాలను ముఖ్యమంత్రి, డీజీపీనే పర్యవేక్షిస్తారనే వాదనా వినిపిస్తోంది. సిబ్బంది ఎంపిక, బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలన్నీ ఇప్పటిలాగే సాగుతాయని అభిప్రాయపడుతున్నారు. వివాదాలకు ఆస్కారమున్న, కీలక నిర్ణయాల్లో మాత్రమే వారి సలహా-సూచనలతో పాటు ఆదేశాలను పాటిస్తారని అంటున్నారు. పునర్వ్యవస్థీకరణ బిల్లు పూర్తి రూపం సంతరించుకుని, విధివిధానాలు, నిబంధనలు అందులో పొందుపరిస్తే తప్ప ఏ విషయాన్నీ కచ్చితంగా ఇలానే జరుగుతుందని చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ సందేహాలుగా ఉన్న అనేక సమస్యలకి అవే సమాధానం చెప్తాయని వివరిస్తున్నారు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న 40 శాంతిభద్రతల ఠాణాల్లో 18 జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రావు. అలాగే 12 ట్రాఫిక్ ఠాణాలలో 4 జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రావు.
సామాజిక అన్యాయం జరిగితేనే జోక్యం
శాంతిభద్రతల్ని గవర్నర్‌కు అప్పగించినా ప్రతి అంశాన్నీ ఆయన పర్యవేక్షించరు. ఎథినిక్ మైనార్టీలుగా పిలిచే గ్రూపులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే తన విస్తృతాధికారాలను వినియోగిస్తారు. ఆయా ఉదంతాలకు సంబంధించిన కేసుల్ని స్వయంగా పర్యవేక్షిస్తారు. గవర్నర్‌కు అప్పగించడం అనేది సామాజిక న్యాయం కోసమే.
- పేర్వారం రాములు, మాజీ డీజీపీ