► అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న శిథిలావస్థలోని భవనాలను వెంటనే కూల్చివేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు స్వయంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నగరంలో ఎడతెగని వర్షం కురుస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ అంశంలో అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
శిథిల భవనాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందిగా వారికి నచ్చజెప్పాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు పదిశాతం, జోనల్ కమిషనర్లు ఐదు శాతం శిథిలావస్థలోని ఇళ్లను తనిఖీ చేయాలని, ఏసీపీలు నూరు శాతం ఇళ్లు తనిఖీ చేయాలని సూచించారు. ఇతర ఆశ్రయం లేని వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించనున్న ప్రాంతాల్లోని ప్రజలకు వాటి గురించి వివరించి వారిని ఒప్పించాల్సిందిగా జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. భవన నిర్మాణ అనుమతులు, సెట్‌బ్యాక్స్ తదితరమైన వాటికి సంబంధించి వచ్చేవారం నుంచి బిల్డర్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫైళ్లను త్వరితంగా పరిష్కరించాలని సూచించారు.