నవంబర్‌ 12న డీజీపీ రిటైర్మెంట్‌! | DGP retirement on November 12 | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 12న డీజీపీ రిటైర్మెంట్‌!

Published Fri, Aug 25 2017 2:24 AM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

నవంబర్‌ 12న డీజీపీ రిటైర్మెంట్‌!

నవంబర్‌ 12న డీజీపీ రిటైర్మెంట్‌!

కొత్త డీజీపీ ఎవరన్నదానిపై చర్చ
రాష్ట్ర హోంశాఖ సలహాదారుడిగా అనురాగ్‌శర్మ!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) అనురాగ్‌శర్మ నవంబర్‌ 12న పదవీ విరమణ చేయబోతున్నారు. తెలంగాణ తొలి డీజీపీగా నియమితులైన ఆయన 2014 జూన్‌ 2న ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2015 నవంబర్‌ 12న పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో అనురాగ్‌శర్మ ఈ ఏడాది నవంబర్‌ 12న పదవీ విరమణ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

రేసులో ఎవరు..?
1982 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అనురాగ్‌శర్మ ప్రస్తుతం రాష్ట్ర కేడర్‌లో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన తర్వాత 1983 బ్యాచ్‌లో ఎస్‌పీఎఫ్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్, 1984 బ్యాచ్‌లో సుదీప్‌ లక్టాకియా సీఆర్‌పీఎఫ్‌ అదనపు డీజీపీగా ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఈష్‌కుమార్‌ నేషనల్‌ క్రైమ్‌ రికారŠుడ్స బ్యూరో డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది డైరెక్టర్‌ జనరల్‌ హోదా పొందిన 1986 బ్యాచ్‌ అధికారులు మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, రాజీవ్‌త్రివేది, ఆలోక్‌ ప్రభాకర్‌ ఉన్నారు. ఈ ఏడుగురూ డీజీపీ పోస్టు కోసం పోటీపడే జాబితాలో కనిపిస్తున్నారు. వీరిలో సుదీప్‌ లక్టాకియా, ఈష్‌కుమార్, అలోక్‌ప్రభాకర్‌ కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. వీరు డీజీపీ రేసులో ఆసక్తి చూపడంలేదు. ఇక మిగిలింది తేజ్‌దీప్‌కౌర్, మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, రాజీవ్‌త్రివేది. ఈ నలుగురిలో ప్రభుత్వం నవంబర్‌ 12న ఇన్‌చార్జి డీజీపీగా ఎవరి పేరు ప్రతిపాదిస్తుందన్న దానిపై పోలీస్‌ శాఖలో చర్చ జరుగుతోంది.

ప్యానల్‌లో అందరి పేర్లు..:
డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్‌గా 30 ఏళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న, డీజీపీ హోదా ఉన్న అధికారుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ప్యానల్‌ జాబితా రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించాలి. రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఏడుగురు అధికారులు డీజీపీ హోదాలో ఉన్నారు. వీరందరి పేర్లూ కేంద్రానికి పంపించాలి. అయితే కేంద్ర సర్వీసులో ఉన్నవారి డిప్యుటేషన్‌ గడువు ముగియకుండా వెనక్కి పంపడం కుదరదు. ఈ క్రమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారుల్లోని ముగ్గురి పేర్లను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. ఈ ముగ్గురిలో ఒక అధికారిని డీజీపీగా నియమించుకునే విచక్షణాధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది.

అనురాగ్‌శర్మకు కీలక పదవి..!
డీజీపీగా పదవీవిరమణ చేయనున్న అనురాగ్‌శర్మకు కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్ర ప్రభుత్వంలో గానీ కీలక పదవి వరించనున్నట్టు అటు పోలీస్, ఇటు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో హోంశాఖ, అంతర్గత భద్రత వ్యవహారాలను మానిటరింగ్‌ చేసేందుకు అనురాగ్‌శర్మను హోంశాఖ సలహాదారుడిగా నియమించే ఆలోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా అటు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వద్ద ఆయనకు మంచి పేరుంది. దీంతో కేంద్ర హోంశాఖలో ఓఎస్డీగా, లేదంటే ప్రత్యేక కమిటీ వేసి, దానికి చైర్మన్‌ను చేసే ఆలోచనలో కూడా కేంద్ర హోంశాఖ వర్గాలున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement