అరచేతిలో 'హాక్ ఐ' | Did you know about Hawk-Eye APP? | Sakshi
Sakshi News home page

అరచేతిలో 'హాక్ ఐ'

Published Sun, Sep 27 2015 11:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

అరచేతిలో 'హాక్ ఐ'

అరచేతిలో 'హాక్ ఐ'

మీ ముందే పోకిరీలు అమ్మాయిలను ఏడిపిస్తున్నారా.. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారా..
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ హంగామా చేస్తున్నారా.. కాలనీల్లో
ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా.. మీ అరచేతిలోని మొబైల్ ద్వారా ఆ నేరాల్ని పోలీసులకు తెలియజేయవచ్చు. అందుకోసం హైదరాబాద్ పోలీసులు రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ హాక్ ఐ
- సాక్షి, వీకెండ్ ప్రతినిధి

అసలు ఏంటీ యాప్..?
ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పోలీసుల ఉల్లంఘనలు, మహిళలపై నేరాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, కాలనీల్లో అధిక శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించడం, తదితర సమస్యలపై ఫిర్యాదు చేయడానికి మీరు ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే ‘హాక్ ఐ’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. మీ వివరాలు కూడా గోప్యం. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు మిమ్మల్ని సంప్రదిస్తారు.

డౌన్‌లోడ్ ఇలా..
గూగుల్ ప్లేస్టోర్‌కి వెళ్లి Hawk Eye అని టైప్ చేస్తే యాప్ డిస్‌ప్లే అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీ వివరాలను పోలీసులకు కూడా తెలియపరచడం మీకు ఇష్టం లేదా..? ఇలాంటి వారి కోసమే అనోనిమాస్ ఆప్షన్ ఇచ్చారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా.. ఈ అనోనిమస్ ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

రిపోర్టు ఏ వైలేషన్ టు పోలీస్
ట్రాఫిక్ ఉల్లంఘన, మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, ఇతర నేరాలను ఈ ఫీచర్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు. నేరానికి సంబంధించిన ఫొటో లేదా వీడియో అప్‌లోడ్ చేస్తే చాలు.

రిజిస్ట్రర్ విత్ పోలీస్...
ఈ మధ్య జరుగుతున్న నేరాల్లో నిందితులు ఎక్కువగా ఇంట్లో అద్దెకు ఉన్నవారు లేదా పని మనిషులు, సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్, పేపర్ బాయ్, మిల్క్ బాయ్, ఇంటికి సర్వీస్ చేయడానికి వచ్చే(ఎలక్ట్రిషియన్, ప్లంబర్,  కార్పెంటర్, ఎల్‌పీజీ సపై్ల సిబ్బంది..) వారు ఉంటున్నారు. వీరికి సంబంధించిన ఎలాంటి వివరాలు దొరక్కపోతుండడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీని కోసమే రిజిస్ట్రర్ విత్ పోలీస్ ఫీచర్‌ను ఇచ్చారు.

ఎమర్జెన్సీ కాంటాక్ట్స్
హైదరాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల నంబర్లు ఈ ఫీచర్‌లో నిక్షిప్తమై ఉన్నాయి. మీరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దగ్గర్లోని పీఎస్‌కు వెంటనే ఫోన్ చేయవచ్చు. ఇందులో ప్రతి స్టేషన్‌కు సంబంధించి ఫోన్ నంబర్, ఎస్‌ఐ, ఏసీపీ, డీసీపీ, కంట్రోల్ రూం, పెట్రోల్ వాహనం ఇలా అన్ని నంబర్‌లు ఉంటాయి.

రిపోర్టు స్టేటస్
ఇప్పటి వరకు ఫిర్యాదు చేసిన ఏ ఏడాదికో రెండేళ్లకో మన సమస్యకు పరిష్కారం లభించేది. ఇప్పుడు అలా కాదు అంతా నిమిషాల్లోనే..  మీ ఫిర్యాదుకు సంబంధించిన ప్రతి సమాచారం మీ అకౌంట్‌కు చేరుతుంది.

వుమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్...
ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రయాణ సమయంలో మహిళలను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను రూపొందిం చారు. మహిళలు ట్యాక్సీ, క్యాబ్, ఆటోల్లో ప్రయాణించే ముందు దాని ఫొటో, రిజిస్ట్రేషన్ నంబర్, ఎక్కడ ఎక్కారు.. ఎక్కడికి వెళ్తున్నారు.. అనే వివరాలను ‘హాక్ ఐ’లో పొందుపరచాలి. మార్గమధ్యలో సమస్య ఎదురైతే ఆ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి.

ఎస్‌ఓఎస్ బటన్...  
ఎమర్జెన్సీ సమయంలో ఈ బటన్ నొక్కితే మీరు ముందుగానే నమోదు చేసిన ఐదుగురు మిత్రులకు ప్రీ రికార్డెడ్ మెసేజ్ వెళ్తుంది. మీరు   ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ సీఐ, ఏసీపీ, డీసీపీ, పెట్రోలింగ్ వాహనాలు, కంట్రోల్ రూంకు కూడా సందేశం వెళ్తుంది. పోలీసులు అప్రమత్తమై మిమ్మల్ని ఆపద నుంచి  రక్షిస్తారు.

కమ్యూనిటీ పోలీసింగ్
మీరు కమ్యూనిటీ పోలీస్ కావాలనుకుంటున్నారా..! మీ కోసమే ఈ ఫీచర్. రిజిస్ట్రేషన్ చేసుకుంటే పోలీసులు మీ సేవల్ని వినియోగించుకుంటారు. ట్రాఫిక్ నియంత్రణ, పెట్రోలింగ్, టెక్నాలజీ సపోర్ట్, నైపుణ్యాలపై శిక్షణ ఇలా వీటిలో ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని మీరు ఒక కమ్యూనిటీ పోలీస్‌గా సేవలందించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement