భవిష్యత్తుపై గంపెడాశలతో గల్ఫ్ బాట పడుతున్న వలస కార్మికులకు నీడలా కష్టాలు వెంటాడుతున్నాయి. అవగాహాన లేమి, ట్రావెల్ ఏంజెట్ల మోసాలు, పనికి పిలిపించుకున్న యజమానుల కక్కుర్తి.. వెరసి వలస కార్మికుల జీవితాలను పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తున్నాయి. తాజాగా పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిలా కార్మికులు పరాయి దేశంలో చిక్కుకుని... యజమానులు చూపించే నరకం నుంచి బయట పడేయాలంటూ మొరపెట్టుకున్నారు.
- సౌదీ అరేబియాలో బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం ఉందంటూ భర్త చెప్పిన మాటలు విని మెహరున్నీసా విమానం ఎక్కింది. నెలకు రూ.35,000ల వరకు వేతనం వస్తుందని చెప్పడంతో సౌదీకి రెడీ అయ్యింది. రియాద్‌కి చేరుకునే సమయానికి తీవ్ర అనారోగ్యం పాలైంది. అక్కడ సరైన ఆశ్రయం, తిండి లభించకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. తనను వదిలేస్తే ఇండియాకి తిరిగి వెళ్తానంటూ చెబితే రూ.2 లక్షలు కడితే కానీ వదిలిపెట్టమంటూ యజమాని హుకుం జారీ చేశారు. దీంతో తనను కాపాడాలంటూ ఆమె వీడియో సందేశాన్ని పంపింది.
- రిజ్వానా బేగం అనే మహిళ నెలకు రూ.25 వేల వేతనం మీద మెయిడ్‌గా పని చేసేందుకు గల్ఫ్‌కి వెళ్లింది. కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించడం, సరైన వసతి కల్పించకుండా నిత్యం నరకం చూపిస్తున్నారు యజమానులు. ఇదేంటని ట్రావెల్ ఏజెన్సీని ప్రశ్నిస్తే.. ఇండియాకు తిరిగి వెళ్లాంటే రూ.2.50 లక్షలు చెల్లించాలు చెప్పారు. దీంతో సాయం అర్థిస్తూ ఆమె ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసింది.
- హసీనా బేగం వలస కార్మికురాలిగా కువైట్‌కి చేరుకుంది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వెన్నుపూసలో సమస్య తలెత్తింది. దీంతో అక్కడ ఉండలేనంటూ తనను ఇండియాకు తీసుకురావాలంటూ కుటుంబ సభ్యుల ద్వారా మొరపెట్టుకుంది.
విదేశాల్లో వలస కార్మికులు పడుతున్న కష్టాలపై కేంద్రం స్పందించింది. ఆయా దేశాలకు చెందిన ఎంబసీ అధికారుకుల సమస్యలను వివరించింది. వారికి ఇబ్బంది రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అవసరం అయితే వారిని ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయాలంది.
Comments
Please login to add a commentAdd a comment