సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా దిగ్విజయంగా కొనసాగుతోందని, ఇక ముందు కూడా సరఫరా కొనసాగిస్తామని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌రావు పేర్కొన్నారు. రైతుల విద్యుదవసరాలకు అనుగుణంగా, డిమాండ్ ఎంతకు చేరినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై అనుమానాలు అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర కరెంట్ సరఫరాకు శనివారం నాటికి 50 రోజులు నిండిన నేపథ్యంలో రఘుమారెడ్డి, గోపాల్‌రావు విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలన్న సంకల్పంతోనే నిరంతర విద్యుత్‌ను అమలు చేస్తున్నామని, దీనిపై కేంద్రం నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పారు. కేంద్ర నిబంధనల మేరకు ఏ జిల్లాలో ఎన్ని పంపుసెట్లు ఉన్నాయి, వాటికి ఎంత కరెంట్ అవసరమన్న లెక్కలు తీసి... మొత్తంగా కనీసం 5 శాతం సోలార్ వినియోగం ఉండేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇప్పటికే దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 3,200 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి జరుగుతోందని తెలిపారు.
10 వేల మెగావాట్లు దాటిన డిమాండ్
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విద్యుత్ వినియోగం 10 వేల మెగావాట్లు దాటిందని రఘుమారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 7.44కి రాష్ట్ర విద్యుత్ వినియోగం 10,002 మెగావాట్లుగా నమోదైంద న్నారు. వేసవి డిమాండ్ 10,600 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని, డిమాండ్ 11,500 మెగావాట్లకు చేరినా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం
నిరంతర విద్యుత్, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాల దృష్ట్యా.. డిస్కమ్‌లు మునిగిపోతున్నాయనే ప్రచారం వాస్తవ విరుద్ధమని రఘుమా రెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న విద్యుత్ కోతలను, పవర్ హాలిడేలను తొలగించామని.. ప్రభుత్వం డిస్కమ్‌లకు పూర్తిస్థాయిలో సహకరిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏడాది రూ.4,777 కోట్ల మేర సబ్సిడీగా ఇచ్చిందని, మరో రూ.2,498 కోట్లను పెట్టుబడిగా పెట్టిందని, నష్టాల దృష్ట్యా రూ.310 కోట్లను అదనంగా ఇచ్చిందని తెలిపారు.
రైతులు జాగ్రత్తగా నీటిని వాడాలి
రాష్ట్రంలో 23 లక్షల పంపుసెట్లు ఉండగా.. దాదాపు సగం చోట్ల ఆటోస్టార్టర్లను తొలగించారని, మిగతావారు కూడా తొలగించాలని రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. అవసరమైన నీటికన్నా అధికంగా వాడితే పంటలకు కూడా నష్టమేనని, జాగ్రత్తగా వాడాలని సూచించారు. 24 గంటల కరెంట్ వద్దని వివిధ చోట్ల నుంచి 10 తీర్మానాలు వచ్చాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment