రాష్ట్రంలో రూ. 1,958 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాలన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ప్రతిపాదనలపై
చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీకి ‘సెంటర్ ఫర్ పవర్ స్టడీస్’ విజ్ఞప్తి
అభ్యంతరాలు, బహిరంగ విచారణకు గడువు పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 1,958 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాలన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ప్రతిపాదనలపై హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని ‘సెంటర్ ఫర్ పవర్ స్టడీస్’ కన్వీనర్, సినియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాలరావు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపు ప్రతిపాదనల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈఆర్సీకి లేఖ సమర్పించారు. డిస్కంలు గతేడాది నవంబర్‌లోగా చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజావ్యతిరేకత ఎదురుకావద్దనే ఉద్దేశంతోనే చార్జీల పెంపు ప్రతిపాదనలపై పదేపదే వాయిదా కోరాయని వేణుగోపాల్‌రావు ఆరోపించారు. డిస్కంలు ఈ నెల 8న సమర్పించిన ప్రతిపాదనలపై ఈ నెల 30లోగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించి ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ తలపెట్టడం సరికాదని ఈఆర్సీకి సూచించారు. అభ్యంతరాల గురించి డిస్కంలిచ్చే సమాధానాలపై అధ్యయనం చేసి బహిరంగ విచారణకు సిద్ధమయ్యేందుకు ఆ వ్యవధి చాలదని, అందువల్ల గడువు పెంచాలని కోరారు.
వినియోగదారులకు రూ. 317.13 కోట్లు తిరిగి చెల్లించండి..
2009-13 కాలంలో ఉమ్మడి రాష్ట్ర డిస్కంలు రూ. 588.47 కోట్ల ఆదాయాన్ని అదనంగా ఆర్జించినట్లు తేల్చిన ఏపీఈఆర్సీ ఆ మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిందిగా గతేడాది నవంబర్ 11న ‘ట్రూ అప్’ ఉత్తర్వులు జారీ చేసిందని వేణుగోపాలరావు గుర్తుచేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర డిస్కంలకు రూ. 317.13 కోట్ల అదనపు అర్జన వాటాలు లభించాయని...ఈ మొత్తాన్ని రాష్ట్ర డిస్కంలు తిరిగి వినియోగదారులకు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ ఉద్యోగులపై అడ్వైజరీని వెనక్కి తీసుకోవాలి...
యాజమాన్యాల అనుమతి లేకుండా విద్యుత్ ఉద్యోగులెవరూ తమ ముందు హాజరు కాకుండా చూడాలని విద్యుత్ సంస్థలకు అడ్వైజరీ జారీ చేయడం ద్వారా ఈఆర్సీ పరిధి దాటిందని వేణుగోపాలరావు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులపై ఆంక్షలు విధించే అధికారం ఈఆర్సీకి లేదని...సాధారణ వినియోగదారులుగా ప్రజాప్రయోజనాల కోసం కృషి చేసే సంఘాల ప్రతినిధులుగా విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీ ముందు హాజరై అభిప్రాయాలను వ్యక్తం చేయడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ అడ్వైజరీని ఉపసంహరించుకోవాలన్నారు.