‘డబుల్’ఆశ! | double bed room laid foundation in hyderabad | Sakshi
Sakshi News home page

‘డబుల్’ఆశ!

Published Fri, Dec 11 2015 3:36 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

‘డబుల్’ఆశ! - Sakshi

‘డబుల్’ఆశ!

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై పెరుగుతున్న ఆసక్తి
 అన్ని వర్గాల వారూ  ముందుకు వస్తున్న వైనం 
 సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల్లో గురువారం జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపనలు నగర ప్రజల్లో కొత్త ఆశలు రేకె త్తించాయి. మురికివాడల్లోని వారు, పేదలే కాకుండా మధ్య తరగతి ప్రజలు సైతం వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను చూసిన ప్రజలు తమకు కూడా అలాంటి ఇళ్లు కట్టిస్తే బాగుండునని ఆశిస్తున్నారు. ఐడీహెచ్ కాలనీలో ఇళ్లతో పాటు రహదారులు, తాగునీరు, విద్యుత్, వరదనీటి కాలువల వంటి మౌలిక సదుపాయాలన్నీ కలుపుకొని ఒక్కో ఇంటికి రూ.9.23 లక్షల వ్యయమైంది. 
 
 ఇందులో ఇంటి నిర్మాణ వ్యయం రూ.7.90 లక్షలు. విస్తీర్ణం 580 చ.అ.  జీ ప్లస్ టూ పద్ధతిలో నిర్మించారు. తాజాగా గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లోనూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాజేంద్రనగర్, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 160 ఇళ్ల చొప్పున, మహేశ్వరం నియోజకవర్గంలో 80 ఇళ్లకు ప్రతిపాదించారు. మిగతా 20 నియోజకవర్గాల్లో 400 చొప్పున నిర్మించాలని ప్రతిపాదించారు. 
 
 స్థానికంగా అందుబాటులో ఉన్న స్థలాలను బట్టి జీప్లస్ 9 , 
జీ ప్లస్ 3 పద్ధతిలో బహుళ అంతస్తుల్లో నిర్మించాలని యోచిస్తున్నారు. ఒక్కో ఇంటికి నిర్మాణ ఖర్చు రూ.6.81 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో 0.75 లక్షలు... మొత్తం రూ. 7.56 లక్షలు కానుంది. ఒక్కో ఇంటిని 560 చ.అ.ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. వీటిలో లివింగ్ హాల్, మాస్టర్ బెడ్ రూమ్, బెడ్ రూమ్, కిచెన్, రెండు రకాల టాయ్‌లెట్లు, బాత్‌రూమ్‌లు ఉంటాయి. 24 నియోజకవర్గాలకుగాను దాదాపు సగం ప్రాంతాల్లో ఇప్పటికే లాంఛనంగా శంకుస్థాపనలు చేశారు. మిగతా ప్రాంతాల్లో త్వరలో చేయనున్నారు.  ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లు చూశాక బహుళ అంతస్తుల ఇళ్లకూ ముందుకొస్తున్నారని... ఓ సంస్థ ప్రతినిధులతో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌తోనూ లబ్ధిదారుల్లో అవగాహన పెరిగి... బహుళ అంతస్తులకు అంగీకరిస్తున్నారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. 
 
 అఫ్జల్‌సాగర్‌లోవాయిదా 
 నాంపల్లి: నగరంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి డివిజన్ అఫ్జల్‌సాగర్‌లోనూ సాయంత్రం 4 గంటలకు శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించారు. మంత్రి కేటీఆర్ వస్తున్నారని ఉదయం నుంచి వందలాది మంది నిరుపేదలు ఎదురు చూశారు.  జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది దగ్గర ఉండి పరిసర ప్రాంతాలు, వీధులను శుభ్రపరిచారు. 
 
 ఇంతలో సాయంత్రం 4 గంటలకు  స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ అక్కడికి చేరుకున్నారు. మంత్రి రావడం లేదని... అనివార్య కారణాలతో శంకుస్థాపన వాయిదా పడిందని తెలిపారు. దీంతో అఫ్జల్‌సాగర్, మాన్గార్ బస్తీ వాసులు నిరాశతో వెనుదిరిగారు. 
 
 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రతిపాదిత స్థలాలు
 1. పిల్లిగుడిసెలు, 2.జంగమ్మెట్, 3.గోడేకిఖబర్, 4.కాంగారి నగర్, 5.లంబాడితాండా, 6.ఇందిరానగర్, 7. దోబీఘాట్ (చిలకలగూడ), 8. హమాలీబస్తీ, 9.కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్, 10. సయ్యద్‌సాబ్‌కాబాడా, 11.పార్థివాడ, 12.అంబేద్కర్ నగర్(లంగర్‌హౌస్), 13. మంగాడి బస్తీ, 14. సారథి నగర్, 15.మైలార్‌దేవ్‌పల్లి, 16.చిత్తారం బస్తీ, 17.కేశవ్ నగర్, 18.పటాన్‌చెరు, 19. భగత్‌సింగ్ నగర్, 20.ఎరుకల నాంచారమ్మ నగర్, 21.సింగంచెరువు, 22.హరిజన బస్తీ (కౌకూరు), 23.కొత్తపేట ఎన్టీఆర్‌నగర్, 24. బహదూర్‌పురా. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement