డబుల్‌ ధమాకా | Double Dhamaka | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా

Published Thu, Dec 15 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

డబుల్‌ ధమాకా

డబుల్‌ ధమాకా

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, ట్రేడ్‌ ఫీజులను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు గాను మొబైల్‌ కోర్టులను వినియోగించుకోవాలని భావిస్తున్నారు.  జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల మేరకు రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసినా చర్యలు తీసుకునేందుకు వీలుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల స్థాయిలో బాధ్యులకు జరిమానాలు విధించవచ్చు. చెల్లించని వారిని మొబైల్‌ కోర్టుకు తీసుకువెళితే అంతకంటే ఎక్కువ జరిమానా విధించడమే కాక  చెల్లించని పక్షంలో రెండు రోజుల వరకు శిక్షకు ఆదేశించే అవకాశం ఉంది. అయితే వీటిపై  జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంతవరకు పెద్దగా దృష్టి సారించలేదు. ముఖ్యంగా ఈ అంశాలను పర్యవేక్షించే పారిశుధ్యం– ఆరోగ్యం విభాగంలోని అధికారులకు వారి దినవారీ పనులతోనే తీరిక లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం స్వచ్ఛ భారత్‌ ర్యాంకింగ్‌లలో తొలి పది స్థానాల్లో  చోటు దక్కించుకునేందుకు  ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ పారిశుధ్య నిర్వహణ,  రోడ్లపై చెత్త లేకుండా చూడటంతోపాటు బహిరంగ మూత్ర విసర్జన, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ  వంటి కార్యక్రమాలను నిరోధించేందుకు మొబైల్‌ కోర్టుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. సాధారణ కోర్టుల్లో కేసు వేసినా చర్యలకు చాలా కాలం పడుతుండటంతో అప్పటికప్పుడు శిక్షలు వేసే మొబైల్‌ కోర్టులను  వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో 1వ మెట్రో పాలిట¯ŒS మెజిస్ట్రేట్‌ (మున్సిపల్‌ కోర్టు) ఆంజనేయులు ఆధ్వర్యంలో  ఇటీవల ఈ మొబైల్‌కోర్టులను ప్రారంభించారు.  జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లలో ప్రతి మంగళవారం ఒక సర్కిల్‌లో ఈ మొబైల్‌కోర్టు నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ అధికారులు విధించిన జరిమానాలను  చెల్లించని వారిని ఈ మొబైల్‌కోర్టు ఎదుట ప్రవేశపెడతారు. మొబైల్‌ కోర్టు ఆదేశానుసారం    జరిమానాను వెంటనే  చెల్లించాలి. లేని పక్షంలో రెండు రోజుల వరకు జైలుశిక్ష  విధించే అవకాశం  ఉందని ముషీరాబాద్‌ సర్కిల్‌ ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ భార్గవ్‌నారాయణ తెలిపారు.   ట్రేడ్‌ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు  నిర్వహిస్తున్నవారికి సైతం ఇది వర్తిస్తుంది. జరిమానా కట్టడమే కాకుండా తదుపరి మొబైల్‌కోర్టు నిర్వహించే నాటికి తప్పనిసరిగా ట్రేడ్‌లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లేకుంటే చర్యల తీవ్రత పెరుగుతుంది. తద్వారా ఇప్పటిదాకా ట్రేడ్‌లైసెన్సులేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నవారు లైసెన్సులు  తీసుకుంటారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి ఆదాయం వస్తుంది. మరోవైపు స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాల అమలు తీరు  మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలోనూ మొబైల్‌కోర్టు పనిచేసినా గత 15 ఏళ్లుగా వాటిని పక్కనబెట్టారు. తిరిగి ఇప్పుడు పునరుద్ధరించడంతో ఇటు ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు.. అటు నగర పరిశుభ్రత రెండూ మెరుగుపడటమే కాక ప్రజల్లో తగిన మార్పు వస్తుందని భావిస్తున్నారు.  ఇప్పటి వరకు ముషీరాబాద్, సనత్‌నగర్‌  తదితర నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ఈ మొబైల్‌ కోర్టుల ద్వారా  నిబంధనలను ఉల్లంఘించిన దాదాపు 50 మంది నుంచి రూ. 25 వేల జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement