డ్రీమ్ బుల్..
హైదరాబాద్‌లో నేడు ‘ది డ్రీమ్ బుల్ షో’
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగవుతున్న ఒంగోలు జాతి పశు సంతతిని పెంపొందించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో స్వదేశీ పశుసంతతి విధానంపై చర్చ జరగనుంది. అదే సమయంలో నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో పశు ప్రదర్శనను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ఒంగోలు గిత్తలు సందడి చేయనున్నాయి. పాడి పరిశ్రమాభివృద్ధి రంగానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటురంగ ప్రముఖులు దీనికి హాజరవుతున్నారు. రైతులు, పశుసంరక్షకులు, దేశవాళీ పశుసంతతి పరిరక్షణకు కృషిచేస్తున్న సంస్థలు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు హాజరవుతున్నట్టు సదస్సు నిర్వాహకులు ప్రకటించారు. బ్రెజిల్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా ఇందులో పాల్గొంటున్నది. ‘ది డ్రీమ్ బుల్ షో’ పేరిట సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో పశు ప్రదర్శన జరుగుతుంది.
వైవీ సుబ్బారెడ్డి ఇంటికి బ్రెజిల్ బృందం..: ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం మేరకు బ్రెజిల్ మినాస్ గెరాయిస్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి జొయావో క్రూజ్ రీస్ ఫిల్హో నాయకత్వంలో వచ్చిన బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లింది. ఒంగోలు జాతి పశు సంతతి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. బ్రెజిల్ బృందం గౌరవార్థం వైవీ సుబ్బారెడ్డి విందు ఏర్పాటు చేశారు.