‘డీఎస్సీ’ బాధితులపై తర్జనభర్జన!
♦ నష్టపోయినవారికి ఉద్యోగాలిచ్చే అంశంలో గందరగోళం
♦ రెగ్యులర్‌గా నియమించడమా, ప్రత్యేక పరీక్ష నిర్వహించడమా?
♦ కన్సాలిడేటెడ్ పే చెల్లించవచ్చా?.. సాధ్యాసాధ్యాలపై సర్కారు పరిశీలన
సాక్షి, హైదరాబాద్: వివిధ డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థులకు ఎలా న్యాయం చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. వారికి రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వవచ్చా, లేక ప్రత్యేక పరీక్ష నిర్వహించి తాత్కాలిక ఉద్యోగాలు కల్పించడమా అన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది. 1998 నుంచి ఇప్పటివరకు 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో ప్రభుత్వ నిర్ణయాల కారణంగా దాదాపు 6,907 మంది ఉపాధ్యాయ అభ్యర్థులు నష్టపోయినట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. వారి సమస్యను పరిష్కరిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు.
సీఎం సూచనల మేరకు ఈ అంశంపై ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రత్యేకంగా సమీక్షించారు కూడా. అయితే 1998 డీఎస్సీ జరిగి 18 ఏళ్లు అవుతోందని, అప్పుడు నష్టపోయినవారు ఇప్పుడు రిటైర్‌మెంట్ వయసుకు సమీపంలో ఉన్నారని విద్యాశాఖ అధికారులు తేల్చారు. పైగా అప్పటి ఉపాధ్యాయ ఖాళీలు ఇప్పుడు లేవని, వారికి ఉద్యోగాలు దాదాపు సాధ్యం కాదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
దీంతో వారికి రూ. 14 వేలు కన్సాలిడేటెడ్ వేతనంతో తాత్కాలిక ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో నష్టపోయిన ఉపాధ్యాయ అభ్యర్థులకు స్పెషల్ డీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతారని, త్వరలో నోటిఫికేషన్ ఇస్తారని మంగళవారం ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేదని విద్యాశాఖ అధికారులు కొట్టిపారేశారు. కాగా.. ఈ అంశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పరిశీలన జరపాలని, అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకున్నా.. తుది నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.