‘ఈ-వైద్యం’ పేరిట దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో సరికొత్త దోపిడీకి తెరలేచింది. పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ సొమ్మును అప్పనంగా అప్పగించేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక కుటుంబ సంక్షేమ శాఖలోని ఓ అధికారి భర్తతో పాటు టీడీపీకి చెందిన ఓ ఎంపీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఈ-వైద్యం’ సేవలు అందించడానికి 45 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. తొలుత విజయవాడ, విశాఖపట్నంలోని ఆరోగ్య కేంద్రాలను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. ఆరు నెలల్లో మిగతా 43 కేంద్రాలను కూడా ప్రైవేట్‌కు అప్పజెప్పనున్నారు.
టెండర్ లేకుండానే
పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఇకపై ఈ-వైద్య కేంద్రాలుగా మారుతాయి. ఎలాంటి టెండర్, ఆన్‌లైన్ ఎంపిక ప్రక్రియ లేకుండానే ఓ ప్రైవేట్ సంస్థ దరఖాస్తు చేసుకోగానే ఇచ్చేశారు. ఇప్పటివరకు పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు నెలకు రూ.90 వేలు ఇచ్చేవారు. తాజాగా ఈ-వైద్య కేంద్రాల పేరుతో నిర్వహణ వ్యయాన్ని రూ.3 లక్షలకు పెంచారు. అంటే ఒక ఆస్పత్రి నిర్వహణకు గాను ప్రైవేట్ సంస్థకు నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తారు. రాష్ట్రంలో 192 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
ఒక్కో కేంద్రానికి నిత్యం 100 నుంచి 200 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. భవిష్యత్‌లో వీటిని కూడా ప్రైవేట్‌కు అప్పజెప్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నిధులు అందజేస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఈ-వైద్య కేంద్రాలుగా మార్చాలన్న ప్రతిపాదనను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం వ్యతిరేకించినట్లు సమాచారం.
పెలైట్ ప్రాతిపదికన ఇచ్చాం
‘‘ప్రస్తుతం పెలైట్ ప్రాతిపదికన విజయవాడ, విశాఖపట్నంలోని ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ సంస్థకు అప్పగించాం. ఈ రెండు కేంద్రాల నిర్వహణ, సంస్థ పనితీరు పరిశీలన అనంతరం మిగతా 43 కేంద్రాల నిర్వహణ ఎవరికి, ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తాం’’
- అరుణకుమారి, సంయుక్త సంచాలకులు, కుటుంబ సంక్షేమ శాఖ
‘ఈ-వైద్యం’ అంటే?
వైద్యులు అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో ‘ఈ-వైద్యం’లో భాగంగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ విధానంలో పట్టణాల్లో ఉండే వైద్యులు గ్రామాల్లోని రోగులకు ఆన్‌లైన్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తారు. నిబంధనల ప్రకారం.. ఈ-వైద్యం సేవలను వైద్యులు లేనిచోట్ల మాత్రమే అందించాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటూ, రవాణా సదుపాయాలు, మందులు ఉండే పట్టణ ఆస్పత్రుల్లో ‘ఈ-వైద్యం’ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించడం గమనార్హం. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ-వైద్యం విధానంలో ఎక్కడి డాక్టర్లు సలహాలు ఇస్తారనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.