సాక్షి, హైదరాబాద్ : పన్ను ఎగవేతకు పాల్పడే వ్యాపారులకు ముకుతాడు వేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన నాటి నుంచి సరైన పర్యవేక్షణ లేక ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు గండిపడుతుండగా, నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ–వే బిల్లు వ్యవస్థతో పన్ను ఎగవేతకు చెక్ పడనుంది. రెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారానికి సంబంధించి రూ.50 వేలు దాటిన సరుకులు రవాణా చేయాలంటే ఏప్రిల్ 1 నుంచి ఈ–వే బిల్లు తప్పనిసరి.
ముందుగా రిజిస్టర్ చేసుకున్న డీలర్లు కచ్చితంగా ఈ–వే బిల్లుతోనే రవాణా చేయాల్సి ఉంటుంది. ఆ బిల్లు లేని పక్షంలో పెద్ద ఎత్తున జరిమానా, కేసులు నమోదు చేసేందుకు జీఎస్టీ చట్టం వెసులుబాటు కల్పించింది. దీంతో ఆదివారం నుంచి జరిగే అంతర్రాష్ట్ర వ్యాపారాలకు ఈ–వే బిల్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఒకే రాష్ట్రంలో జరిగే వ్యాపారాల్లో రూ.50 వేలు విలువైన సరుకు రవాణా చేసేందుకు ప్రస్తుతానికి ఈ–వే బిల్లు అవసరం లేదు. జూన్ 1 నుంచి ఈ రవాణాకు కూడా ఈ–వే బిల్లును వర్తింపజేయనున్నారు.
దేశంలో ఎక్కడికైనా..
ఈ–వే బిల్లుతో దేశంలో ఎక్కడికైనా సరుకులను రవాణా చేసుకునే వీలు కలగనుంది. రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణాలకు దీన్ని అధికారిక పత్రంగా గుర్తించనున్నారు. సరుకు సరఫరా చేసే వారు లేదా కొనుగోలుదారు.. ఎవరైనా ఒకరు ఈ–వే బిల్లును చూపించాలి.
వస్తుసేవపన్ను (జీఎస్టీ) రిజిస్ట్రేషన్ లేని వ్యాపారి నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాపారి సరుకులను కొనుగోలు చేయవచ్చు లేదా సరఫరా చేయవచ్చు. కానీ ఈ సరుకులకు సంబంధించిన పూర్తి బాధ్యత రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపారే వహించాల్సి ఉంటుంది. ఈ–వే బిల్లును మొబైల్ యాప్‌ల ద్వారా కూడా పొందే అవకాశం ఉంది.
కొన్నింటికి మినహాయింపు
కొన్ని సరుకుల రవాణాకు ఈ–వే బిల్లును మినహాయించారు. నాన్ మోటార్ వాహనాల ద్వారా రవాణా చేసే సరుకులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు రైలులో రవాణా చేసే వాటికి, రక్షణ శాఖ, కస్టమ్స్‌లకు సంబంధించిన సరుకులకు, ఖాళీ కంటెయినర్లకు ఈ–వే బిల్లులు అవసరం లేదు.
నేపాల్, భూటాన్ దేశాలకు సంబంధించిన ఎగుమతులు, దిగు మతులకు కూడా ఈ–వే బిల్లు అవసరం లేదని రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ–వే బిల్లు విషయంలో వ్యాపారులకు ఏవైనా సందేహాలుంటే పన్నుల శాఖ సర్కిల్ కార్యా లయాల్లో లేదా 1800–425–3787 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ తెలిపారు. ఈ–వే బిల్లు లేకుండా ఎలాంటి సరుకులు రవాణా చేసినా చర్యలు తీసుకుంటామని శనివారం ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment