
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న కేటీఆర్ పలు సమావేశాల్లో ప్రసంగించడంతో పాటు అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో చర్చలు జరిపారు. కేటీఆర్ బృందం నిర్వహించిన ఈ పర్యటన విజయవంతమైందని ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, టీఎస్‌ఐపాస్ పనితీరు, సింగిల్ విండో విధానంలో అనుమతులు తదితర అంశాలపై కేటీఆర్ వివరించారని పేర్కొంది. ఈ సదస్సులో జరిగిన చర్చల ద్వారా వరంగల్‌లో టెక్ మహీంద్ర కార్యాలయం ఏర్పాటుకు కంపెనీ యాజమాన్యం అంగీకరించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు ఇది అద్భుత స్పందన అని పేర్కొన్నారు.
స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో స్థానిక సమస్యలకు చక్కటి పరిష్కారాలు చూపొచ్చని కేటీఆర్ తెలిపారు. శనివారం సదస్సులో భాగంగా జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఓ ప్రాంతంలోని సమస్యలకు పరిష్కారాలను కనుగొనే సమయంలో స్థానిక సంస్కృతి, భాష, ప్రాంతీయ వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఓ ప్రాంతంలో ఉపయోగపడే పరిష్కారాలు ఇతర ప్రాంతాల్లో పనిచేయకపోవచ్చని వివరించారు. స్థానిక సమస్యలకు పరిష్కారాలను చూపడంలో ప్రజలకు సహకరించడం, గ్లోబల్ కంపెనీలు స్థానికంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment