ఇంజినీరింగ్ చదువుతూ చోరీలు
=అదుపులో ఆరుగురు విద్యార్థులు
=నలుగురు స్నాచింగ్‌లు.. ఇద్దరు ఇళ్లలో చోరీలు
=ఏడాదిలో 50కిపైగా నేరాలు
=నిందితుల నుంచి కిలో బంగారం స్వాధీనం!
సాక్షి, సిటీబ్యూరో: వాళ్లంతా ఇంజినీరింగ్ విద్యార్థులు.. ధనిక కుటుంబాలకు చెందినవారే. జల్సాలకు అలవాటుపడి చదువుకోవాల్సిన వయసులో నేరాల బాట పట్టారు. విలాసాలకు అవసరమైన డబ్బు కోసం గొలుసు చోరీలు మొదలెట్టి.. 50కిపైగా స్నాచింగ్‌లు చేశారు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బును సినిమాలు, షికార్లకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. మూడు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. రూ.30 లక్షల విలువైన కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీరి అరెస్టును త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు ఇటీవల జరిగిన ఆయా సంఘటనల వివరాలిలా ఉన్నాయి.
మాటేసి.. స్నాచింగ్...
పటాన్‌చెరు సమీపంలోని కంది గ్రామం వద్ద ముంబై జాతీయ రహదారిపై బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పారిపోసాగారు. బాధితురాలి అరుపులు విని అప్రమత్తమైన గ్రామస్తులు వారి వెంబడించి బైక్‌తో పాటు ఒక యువకుడిని పట్టుకోగలిగారు. మరో యువకుడు పారిపోయాడు. అనంతరం అతను కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు విచారణలో ఇద్దరూ ఇంజినీరింగ్ విద్యార్థులని తెలిసింది.
పారిపోతూ కిందపడి...
కూకట్‌పల్లిలోని జయానగర్‌లో ఒంటరిగా వెళ్తున్న మహిళపై బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు స్నాచింగ్ చేశారు. పారిపోయే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఇద్దరూ ఇంజినీరింగ్ విద్యార్థులని, ఏడాదిగా స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని వెల్లడైంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీకాలనీ, మియాపూర్ ఠాణాల పరిధిలో నేరాలకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించారు.
అద్దె ఇంటి కోసం వచ్చి....
ఈ ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులది మరో ైశైలి. అద్దె గది కావాలని వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసుకుని బంగారు నగలు, నగదు దోచుకెళ్తున్నారు. టు-లెట్ బోర్డు కనిపిస్తే చాలు వీరిద్దరూ బైక్‌పై అక్కడికి వచ్చి వాలిపోతారు. తమకు అద్దెకు గది కావాలని అడుగుతారు. గదిని చూశాక మంచినీళ్లు కావాలని అడుగుతారు. ఇంటి యజమానురాలు వంటింట్లోకి వెళ్లగానే వెనుకే లోపలికి వెళ్లి ఆమెను నిర్బంధించి నగలు దోచుకుంటారు. ఇలా వీరు కూకట్‌పల్లిలో రెండు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారని తెలిసింది.