మందమర్రి రూరల్/ నెన్నెల: డబ్బు చోరీ చేశావంటూ తోటి విద్యార్థులు వేసిన నింద భరించలేకపోయాడు. పదేపదే డబ్బు విషయమై ప్రశ్నించడంతో అవమానంగా భావించిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా, చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్యాంపటేల్, హాస్టల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన కామెర ప్రభాస్(20) మందమర్రి జోన్–2లోని ఎస్సీ బాలుర వసతిగృహంలో ఉంటూ మంచిర్యాలలోని సీవీ. రామన్ కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్‌లో తోటి విద్యా ర్థులు రూ.1,100 పోయాయంటూ ఈ నెల 2వ తేదీన ప్రభాస్ బ్యాగు తనిఖీ చేయగా, అందులో డబ్బులు లభించాయి.
ఆ సమయంలో ప్రభాస్ లేకపోవడంతో వచ్చాక డబ్బులు తీశావా అంటూ ప్రశ్నించారు. తాను తీయలేదని చెప్పాడు. కాసేపటి తర్వాత ప్రభాస్ బ్యాగు చూసుకొని అందులో తన డబ్బులు లేవని, ఎవరు తీశారని ప్రశ్నించాడు. దీంతో తోటి విద్యార్థులు బ్యాగులో ఉన్న రూ.1,100 తామే తీశామని, అవి ఎక్కడివని ఎదురు ప్రశ్నించారు. దీంతో తనకు తెలిసిన అమ్మాయి గూగుల్ పే ద్వారా పంపించిందని ఓసారి, హాస్టల్ సమీపంలోని దుకాణ నిర్వాహకుల ఫోన్ ద్వారా పంపించిందని మరోసారి చెప్పాడు. దుకాణానికి వెళ్లి అడగ్గా సరైన సమాధానం లభించలేదు.
డబ్బులు పంపించినట్టుగా స్క్రీన్ షాట్ పంపిస్తే నమ్ము తామని చెప్పగా.. 3వ తేదీన తీసుకొస్తానన్నాడు. ఆ రోజు ఇదే విషయమై తోటి విద్యార్థులు మళ్లీ ప్రశ్నించగా, అమ్మాయి కలవలేదని, ఫోన్‌లిఫ్ట్ చేయలేదని చెప్పగా, స్క్రీన్ షాట్ చూపిస్తేనే డబ్బులు ఇస్తామని మళ్లీ చెప్పారు. దీంతో 4వ తేదీన ఉదయం హాస్టల్ నుంచి స్వగ్రామమైన జోగాపూర్‌కు వచ్చి శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగాడు. ఇరుగుపొరుగు వారు ప్రశ్నించడంతో అవమానపర్చిన విషయం చెప్పాడు.
108 అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వా స్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడి అన్న రాజశేఖర్ ఫిర్యాదు మేరకు హాస్టల్ వార్డెన్‌తోపాటు ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మంచిర్యాల ప్రభుత్వాస్పత్రి ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి.
Comments
Please login to add a commentAdd a comment