దొంగతనం కోసం వచ్చి.. వంటింట్లో బాదం పప్పు తినేసి. | Thief Target Locked Houses For Money Nalgonda | Sakshi
Sakshi News home page

దొంగతనం కోసం వచ్చి.. వంటింట్లో బాదం పప్పు తినేసి.

Published Tue, May 10 2022 9:53 AM | Last Updated on Tue, May 10 2022 10:40 AM

Thief Target Locked Houses For Money Nalgonda - Sakshi

సాక్షి,నల్లగొండ క్రైం: నీలగిరిలో దుండగులు తెగబడుతున్నారు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని అందినకాడికి దోచుకుపోతున్నారు. అదే తరహాలో సోమవారం తెల్లవారుజామున పట్టణంలోని నాగార్జున గ్రామీణ బ్యాంక్‌ కాలనీలో తాళం వేసి ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్రా వెంకట్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. ఇల్లంతా సోదాలు నిర్వహించినా సొత్తు లభించలేదు. దీంతో వంటింట్లో ఓ డబ్బాలో ఉన్న బాదం పప్పు ఆరగించి వెళ్లిపోయారు. కాగా, హైదరాబాద్‌లో ఉంటున్న కూతురును చూసేందుకు భార్యతో కలిసి శనివారం వెళ్లిన వెంకట్‌రెడ్డి ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్థానికులు తెలపడంతో ఆయన తిరిగివచ్చాడు. ఇంట్లో సొత్తు పెట్టలేదని, కానీ దొంగలు బాదం పప్పు తిని వెళ్లారని తెలిపారు.  

తాళం వేశావా అన్న మాటలు విని..
అదే కాలనీలో టీచర్‌ వెంకట్‌రెడ్డి ఇంటి ఎదురుగానే తాళ్లపల్లి చంద్రయ్య, కళమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. కళమ్మ మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికురాలు. ప్రతి రోజు తెల్లవారుజామున చంద్రయ్య తన భార్యను విధులు నిర్వర్తించే ప్రాంతంలో బైక్‌పై వదిలి వస్తాడు. ఉద యం 4:30 గంటలకు రోజూమాదిరిగా కళమ్మను కలెక్టరేట్‌ వద్ద దించేందుకు వెళ్తూ ఇంటికి తాళం వేశావా అంటూ భార్యను ప్రశ్నించాడు.

అదే సమయంలో నర్రా వెంకట్‌రెడ్డి ఇంట్లో ఉన్న దుండగులు ఆ మాటలు విన్నారు. చంద్రయ్య భార్యతో బైక్‌పై వెళ్లగానే అతడి ఇంటి తాళాన్ని పగులగొట్టి లోనికి చొరబడ్డారు. ఫ్రిడ్జ్‌పై ఉన్న తాళం చెవులను తీసుకుని బీరువా తెరిచి అందులో ఉన్న పది తులాల బంగారు, 28 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.50వేల నగదును అపహరించుకుపోయారు. చంద్రయ్య 5:30 ఇంటికి తిరిగి రాగా చోరీ విషయం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

చదవండి: Hyderabad: వెస్ట్‌ బెంగాల్‌ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement