ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: ఓ పారిశ్రామిక వేత్త ఇంటికి సున్నం కొట్టేందుకు వెళ్లిన నలుగురు కార్మికులు కన్నం వేశారు. ఏకంగా రూ. 2.5 కోట్ల నగదును అపహరించుకెళ్లారు. ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో నలుగుర్ని అరెస్టు చేశారు. వివరాలు.. తిరుప్పూర్‌కు చెందిన దురైస్వామి (56)పారిశ్రామిక వేత్త. ఆయనకు బనియన్ ఉత్పత్తి పరిశ్రమలు, నూలు ఉత్పత్తి మిల్లులు ఉన్నాయి. ఆయన కుమార్తెకు ఇటీవల వివాహం అయ్యింది. ఇంట్లో భార్య ధనలక్ష్మితో పాటుగా దురైస్వామి ఉన్నారు. వీరికి సేవల్ని అందించేందుకు కొందరు పని వాళ్లు కూడా ఉన్నారు.
పోలీసుల అదుపులో నిందితులు
ఈ పరిస్థితుల్లో లెక్కల వ్యవహారాల్ని పరిశీలించే క్రమంలో ఇంట్లో ఉన్న నగదు, నగలు మాయం కావడంతో తనకు కావాల్సిన వారి ద్వారా చెన్నై పోలీసుల్ని ఆశ్రయించారు. ఇక్కడి నుంచి తిరుప్పూర్‌కు కేసు బదిలీ అయ్యింది. రెండు నెలల క్రితం ఆయన కుమార్తె వివాహం జరగ్గా, అంతకు ముందు ఇంటిని శుభ్రం చేసేందుకు కార్మికులు రంగంలోకి దిగారు. సున్నం కొట్టే వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. వీరిలో తిరువణ్ణామలైకు చెందిన సతీష్, దామోదరన్, శక్తి, నీలగిరికి చెందిన రాధాకృష్ణన్‌పై అనుమానాలు నెలకొన్నాయి. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
సున్నం కొట్టే సమయంలో దురై స్వామి ఇంట్లో తమకు ఒక రహస్య గది కనిపించిందని, అందులోకి వెళ్లి చూడగా, కొన్ని చిన్న చిన్న సంచుల్లో రూ. 2 వేల నోట్లను మూటలు కట్టి పడేసి ఉన్నాయని, అందులో ఓ సంచితో తాము ఉడాయించినట్టు అంగీకరించారు. దీంతో ఈ నలుగుర్ని బుధవారం అరెస్టు చేశారు. వీరు పట్టుకెళ్లిన నగదు రూ. 2.5 కోట్లుగా తేల్చారు. ఆ నగదు ఎక్కడ దాచి పెట్టారో తదితర వివరాల్ని నిందితుల వద్ద సేకరిస్తున్నారు. అలాగే, 75 లక్షలు విలువైన బంగారంతో తమకు సంబంధం లేదని ఈ నిందితులు పేర్కొనడంతో ఆ దొంగల కోసం వేట ప్రారంభించారు.
చదవండి: Banjara hills: వివాహితతో రెండేళ్లుగా సహజీవనం..దూరం పెడుతోందని..
Comments
Please login to add a commentAdd a comment