తెలంగాణలో టీడీపీకి భారీ షాక్ | Errabelli dayakar other Leaders join in TRS party | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీడీపీకి భారీ షాక్

Published Thu, Feb 11 2016 2:07 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

తెలంగాణలో టీడీపీకి భారీ షాక్ - Sakshi

తెలంగాణలో టీడీపీకి భారీ షాక్

కారెక్కిన ఎర్రబెల్లి
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా
టీడీపీ శాసనసభాపక్ష నేతను కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్‌కు లేఖ రాస్తాం
తెలంగాణలో టీడీపీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
బాబుకు ఫ్యాక్స్‌లో ఎర్రబెల్లి, ప్రకాశ్ రాజీనామా లేఖలు
15 మంది ఎమ్మెల్యేల్లో ఆ పార్టీకి మిగిలింది ఆరుగురే...
వారిలోనూ ముగ్గురు కారెక్కుతారన్న ఎర్రబెల్లి
ఎర్రబెల్లి, వివేకానంద, ప్రకాశ్‌లను సస్పెండ్ చేసిన టీడీపీ

 
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ ఎస్ పార్టీ ఆకర్ష్ దెబ్బకు తెలంగాణ టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. బుధవారం ఏకంగా టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు! ఆయనతో పాటు రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే వివే కానంద గౌడ్ మంగళవారమే సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడం తెలిసిందే. ఆ మర్నాడే ఇలా ఏకంగా టీడీఎల్పీ నేత మరో ఎమ్మెల్యేతో కలసి టీఆర్‌ఎస్‌లో చేరి టీడీపీకి కోలుకోలేని షాకిచ్చారు. ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరతారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా ప్రతిసారీ ఆయన ఖండిస్తూ వచ్చారు.
 
 బుధవారం నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు, అది ముగియగానే నేరుగా హైదరాబాద్ ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఎర్రబెల్లి నివాసానికి చేరుకున్నారు. గంటసేపు ఆయనతో చర్చలు జరిపిన హరీశ్, చివరకు ఎర్రబెల్లి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం హరీశ్ తన కారులోనే ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ ఇద్దరినీ వెంట తీసుకుని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్  వారిద్దరితో దాదాపు గంటసేపు మాట్లాడారు. అనంతరం వారికి గులాబీ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్‌లు తమ రాజీ నామా లేఖలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫ్యాక్స్‌లో పంపారని సమాచారం. ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్, వివేకానంద గౌడ్‌లను తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి అధినేత చంద్రబాబు బుధవారం సస్పెండ్ చేశారు.
 
 తెలంగాణలో టీడీపీ బతికి బట్టకట్టదు
 తెలంగాణ ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, రాష్ట్రంలో టీడీపీ బతికి బట్టకట్టే పరిస్థితి కనిపించడం లేదని ఎర్రబెల్లి అన్నారు. సీఎం సమక్షంలో గులాబీ క ండువా కప్పుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరో ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లోకి వచ్చే అవకాశముందని వివరించారు. వరంగల్ జిల్లాకు చెందిన మరికొం దరు టీడీపీ నాయకులు కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరతారన్నారు. టీడీపీ శాసనసభా పక్షాన్ని (టీడీఎల్పీని) టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ ఇవ్వనున్నట్టు కూడా ఎర్రబెల్లి చెప్పారు. ‘‘టీడీపీని వీడటం బాధగానే ఉంది. తప్పని పరిస్థితుల్లో పార్టీ మారుతున్నా, కార్యకర్తలంతా క్షమించాలి. తెలంగాణలో టీడీపీని కాపాడే ప్రయత్నం చేశా.
 
  కానీ ఇక్కడ టీడీపీ బతకదు. పార్టీ జెండా రూపకల్పనలో కూడా సభ్యుడిగా ఉన్న నేను త ప్పని పరిస్థితుల్లో పార్టీ మారా. టీడీపీ కార్యకర్తలూ అర్థం చేసుకుని టీఆర్ ఎస్‌లో చేరాలి. వరంగల్‌లో కానీ, నిజాం కాలేజీ మైదానంలో కానీ  బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటాను’’ అని ఆయనన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. టీడీపీ నిబంధనల మేరకే టీఆర్‌ఎస్ నేతలను కానీ,   సీఎంను కానీ విమర్శించాననన్నారు. అది పార్టీ వ్యవహారం మాత్రమేనన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ప్రకాశ్ గౌడ్ చెప్పారు.
 
 టీడీపీకి మిగిలింది ఆరుగురే
 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. వివేక్, ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్‌లతో కలిపి ఇప్పటికి 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌లో చేరారు. మిగిలిన ఆరుగురిలో ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆ లెక్కన ఇప్పుడిక తెలంగాణలో టీడీపీకి మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే. వారు మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డి (కొడంగల్), ఎస్.రాజేందర్‌రెడ్డి (నారాయణ్‌పేట), హైదరాబాద్ నుంచి మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి). వీరిలోనూ కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు త్వరలో గులాబీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.
 
టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు
 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి, అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య బుధవారంతో 9కి చేరింది.
వారు...
 1. తలసాని శ్రీనివాస్‌యాదవ్    సనత్‌నగర్
 2. చల్లా ధర్మారెడ్డి    పరకాల
 3. తీగల కృష్ణారెడ్డి    మహేశ్వరం
 4. మాధవరం కృష్ణారావు    కూకట్‌పల్లి
 5. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి    ఇబ్రహీంపట్నం
 6. జి.సాయన్న    కంటోన్మెంట్
 7. కేపీ వివేకానంద    కుత్బుల్లాపూర్
 8. ఎర్రబెల్లి దయాకర్‌రావు    పాలకుర్తి
 9. ప్రకాశ్ గౌడ్    రాజేంద్రనగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement