గబ్బర్ సింగ్ హీరోలా మాట్లాడాడే కానీ...
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌కు పార్టీపై అవగాహన లేదని.. ఏవో సినిమా డైలాగులతో జనసేన అంటూ పార్టీ పెట్టారని టీఆర్‌ఎస్ నేత ఎర్రొళ్ళ శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు అన్నారు. తెలంగాణ ప్రజలను, సంస్కృతినీ కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని ఎర్రొళ్ళ హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు... గబ్బర్ సింగ్ హీరోలా మాట్లాడాడే కానీ ఒక పరిణితి చెందిన నాయకుడిగా, ఉద్యమకారుడిలా, ప్రజల కోసం సేవ చేస్తున్న వ్యక్తిలా మాట్లాడలేదని ఎర్రొళ్ళ అన్నారు. కేవలం ప్రజలపైన, సమాజంపైనా అవగాహన లేదని అర్థం అయిపోయిందన్నారు.
చంద్రబాబును సీఎంను చేయటానికే మరోరూపంలో వచ్చిన ఆంధ్రా బాబు...పవన్ కల్యాణ్ బాబుగానే చూస్తామే తప్ప...ఈ ప్రాంతానికి ఏదో చేస్తాడనే అభిప్రాయం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. పవన్ పెట్టింది జనసేన కాదని బాబుసేన అని ఎర్రొళ్ళ మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తే తాటా తీస్తారన్న విషయాన్ని మర్చిపోకూడదని ఆయన హెచ్చరించారు.