బహిరంగసభలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్, వేదికపై మాజీ స్పీకర్ మనోహర్ తదితరులు
తెనాలి రూరల్: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై కక్ష సాధించేందుకే టీఆర్‌ఎస్ నాయకులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు’’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆరోపించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదరావూరు– కూచిపూడి మార్గంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు. గతంలో టీఆర్‌ఎస్ నాయకులు జగన్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని అన్నారని, వారే ఇప్పుడు చంద్రబాబు గారిపై కక్ష సాధించేందుకు జగన్‌కు మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు పట్ల పవన్‌కున్న సానుకూలతను ఆయన తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయని విశ్లేషకులు అంటుండడం గమనార్హం.
దోపిడీ లేని పాలన అందిస్తే అభ్యంతరం లేదు
వైఎస్సార్‌సీపీ, టీడీపీ దశాబ్దాలపాటు పాలించవచ్చని, తనకేం అభ్యంతరం లేదని, అయితే ఇసుక మాఫియా లేని, ప్రజాధన దోపిడీ లేని పాలనను అందించాలని పవన్ అన్నారు. వైఎస్ జగన్ 30 ఏళ్లు సీఎంగా చేయాలని ఉందని తనకెవరో తెలియజేశారని, అలాగే బాబు(చంద్రబాబు) రావాలి, వాళ్ల బాబు (లోకేష్) రావాలని వీళ్లూ కోరుకుంటున్నారని, ఎవరు వచ్చినా, అవినీతి లేని పాలన అందించాలన్నారు. 30, 40 ఏళ్లక్రితం నాయకులు చేసిన తప్పులకు ఇప్పుడు రాష్ట్రం విడిపోయి, ఆ తప్పులకు మనం బాధ్యత వహించాలా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు తమకు ఆఖరు ఎన్నికలు కాదని, ప్రారంభం మాత్రమేనని జనసేన నాయకులకు చెప్పినట్టు ఆయన తెలిపారు. 25 కిలోల బియ్యం బస్తా కాదు... 25 ఏళ్ల భవిష్యత్తు కావాలన్నదే యువత నినాదమవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్తోపాటు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు, మాజీ మంత్రి పి.బాలరాజు, తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు.
రైతులు, మహిళలు, విద్యార్థుల అసహనం..
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చే పవన్ బహిరంగసభ అనంతరం వ్యవసాయక్షేత్రంలో విద్యార్థులు, రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారంటూ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ఉంటుందని చెప్పారు. అయితే సాయంత్రం 5.25 గంటలకు బహిరంగసభలో ప్రసంగించిన పవన్ సంక్రాంతి సంబరాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. భోగి మంటలు వేసిన తర్వాత రాత్రి 7.13 గంటలకు అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో మధ్యాహ్నం నుంచి అన్నం నీళ్లు లేకుండా ఆయనకోసం నిరీక్షించిన విద్యార్థులు, మహిళలు, రైతులు తీవ్ర అసహనానికి, ఆవేదనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment