'పవన్తో పొత్తుకు బాబు తహతహ'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తహతహలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో అన్న చిరంజీవి పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసిన పవన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారన్నారు. అలాంటి చంద్రబాబు ప్రస్తుతం పవన్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుండటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు అనుసరిస్తున్నవైఖరిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం హైదరాబాద్లో గట్టు రామచందరావు విలేకర్లతో మాట్లాడారు.
అలాగే గత ఎన్నికలలో ప్రచారానికి తీసుకువచ్చిన జూ.ఎన్టీఆర్ను ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంచుతున్నావని బాబును ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ప్రజాధరణ చూసి బాబు భయపడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఫలితాలు వెంటనే ప్రకటించాలని తాము ఎలక్షన్ కమిషన్ను కోరుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఫలితాలకు తాము భయపడటం లేదన్నారు. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో వివిధ పార్టీలలో మహాకూటమీ ఏర్పాటు చేశారని, ఇప్పుడు మాయాకూటమీ ఏర్పాటు చేస్తున్నారని గట్టు రామచందరావు ఎద్దేవా చేశారు.