డ్రగ్స్ రాకెట్ కేసులో పబ్ ఓనర్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారించారు.
హైదరాబాద్: డ్రగ్స్ రాకెట్ కేసులో పబ్ ఓనర్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం తమ కార్యాలయంలో విచారించారు. ఎక్సైజ్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న 17 పబ్బులు, బార్లకు చెందిన యజమానులు, మేనేజర్లకు వాటి నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. ఇకనుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని వారికి తగిన సూచనలిచ్చారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తే సమాచారం ఇవ్వాలని పబ్బులు, బార్ల యాజమానులను ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో నేడు నాలుగోరోజు విచారణ కొనసాగుతోంది. ఇదివరకే పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులను విచారించిన సిట్ అధికారులు నేడు నటుడు తరుణ్‌ను విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డ్రగ్ డీలర్ కెల్విన్‌తో పరిచయాలపై తరుణ్‌ను ప్రశ్నిస్తున్నారు. తరుణ్ గతంలో నిర్వహించిన పబ్‌కు సంబంధించిన వివరాల నేపథ్యంలోనూ విచారణ కొనసాగుతోంది.