బంగ్లాదేశ్‌కు విత్తనాల ఎగుమతి
వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ అవసరాల మేరకు నాణ్యమైన వరి, జనుము, కూర గాయల విత్తనాలను రాష్ట్రం నుంచి ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. బంగ్లాదేశ్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాజీ జహంగీర్ కబీర్ నేతృత్వం లోని విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారుల బృందం భారతదేశంలో విత్తన ధ్రువీకరణపై అధ్యయనం చేయటానికి మూడు రోజుల పర్యటనకు హైదరాబాద్ వచ్చింది.
సోమ వారం ఆ బృందం తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ ఆ మేరకు సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈజిప్ట్, సూడాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు 4 వేల క్వింటాళ్లకు పైగా విత్తనాలు ఎగుమతి అయినట్లు తెలిపారు. ఈ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణ, సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణలపై చేస్తున్న కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బంగ్లాదేశ్ ప్రతినిధి కబీర్ మాట్లాడుతూ తమ దేశంలో కూడా కొత్త విత్తన చట్టం రానున్నదన్నారు.