Seed Exports
-
విత్తన ఎగుమతికి అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు నాణ్యమైన విత్తనాల ఎగుమతికి విస్తృత అవకాశాలున్నాయని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన విత్తనోత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్ వర్క్‌షాప్‌ను.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. విత్తన ఎగుమతులతో రాష్ట్ర రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పోచారం వెల్లడించారు. సరిహద్దులతో సంబంధం లేకుండా విత్తన ఎగుమతులు, మార్కెటింగ్‌కు అన్ని దేశాలు అంగీకరించాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధిక విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల వాతావరణం ఉందన్నారు. దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేసే చాన్స్: పార్థసారథి వివిధ దేశాల సాగు పరిస్థితులు, పంటల తీరును ఆకళింపు చేసుకుని విత్తనోత్పత్తి చేయాలని.. భారత్, ఆఫ్రికా, ఇతర దక్షిణాసియా దేశాల్లో ఒకే రకమైన పంటలు సాగులో ఉన్న విషయాన్ని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ప్రస్తావించారు. ఆయా దేశాల్లో తెలంగాణ విత్తనాలకు మంచి మార్కెట్ ఉందని, ప్రపంచ విత్తన వ్యాపారంలో భారత్ కేవలం 4.4 శాతం వాటాను మాత్రమే కలిగి ఉందన్నారు. ఈ వాటాను పది శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. గత రెండేళ్లలో ఓఈసీడీ ద్వారా విత్తన ధ్రువీకరణ పొంది, ఎగుమతులు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఫిలిప్పీన్స్, సూడాన్, ఈజిప్ట్ దేశాలకు రాష్ట్రం నుంచి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయన్నారు. దక్షిణాసియా దేశాలైన మయన్మార్, థాయ్‌లాండ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశా ల్లో సాగయ్యే పత్తి విత్తనాలు.. తెలంగాణ నుంచి ఎగుమతి చేసే వీలుందని పార్థసారథి తెలిపారు. ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధిరేటు 7 శాతం కాగా, భారత్‌లో ఇది 17 శాతంగా ఉందని.. 2027 నాటికి జనాభా పెరుగుదలతో చైనాను భారత్ మించుతున్న నేపథ్యంలో ఆహార భద్రత కోసం విత్తనోత్పత్తి పెరగాల్సిన అవసరముందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, ఇస్టా అధ్యక్షుడు క్రెయిగ్ మాక్‌గిల్, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతినిధి చికెలు బా, ఆఫ్రికాలోని వివిధ దేశాల నుంచి 35 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విత్తనరంగంలో తెలంగాణ ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: విత్తనరంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బుకార్ టిజాని ప్రశంసించారు. రోమ్ పర్యటనలో భాగంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు ఆయనతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుకార్ మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇతర దేశాలకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులకు నాణ్యమైన విత్తనం అందించేలా చేయాలన్నది ఎఫ్ఏవో నిబంధనల్లో ఒక కీలకమైన అంశమని చెప్పారు. భారత్ ఇప్పటికే ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తుందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనాభివృద్ధి కోసం ఎఫ్‌ఏవోకు తెలంగాణ సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్‌లో విత్తన పార్కును నెలకొల్పి 400 విత్తన కంపెనీలకు అవసరమైన వసతులు కల్పించడం అభినందనీయవన్నారు. అంతర్జాతీయ విత్తనోద్యమంలో తాము తెలంగాణతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో విత్తనోత్పత్తి, విత్తనాభివృద్ధికి గల అవకాశాలను వివరించారు. గ్లోబల్ సీడ్ హబ్‌గా రాష్ట్రాన్ని గుర్తిస్తున్నామని ఎఫ్ఏవో ప్రకటించినట్లు కేశవులు తెలిపారు. అందులో భాగంగా ఎఫ్ఏవో బృందం వచ్చే జూన్, జూలైల్లో రాష్ట్రానికి రానుందని పేర్కొన్నారు. -
బంగ్లాదేశ్‌కు విత్తనాల ఎగుమతి
వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ అవసరాల మేరకు నాణ్యమైన వరి, జనుము, కూర గాయల విత్తనాలను రాష్ట్రం నుంచి ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. బంగ్లాదేశ్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాజీ జహంగీర్ కబీర్ నేతృత్వం లోని విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారుల బృందం భారతదేశంలో విత్తన ధ్రువీకరణపై అధ్యయనం చేయటానికి మూడు రోజుల పర్యటనకు హైదరాబాద్ వచ్చింది. సోమ వారం ఆ బృందం తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ ఆ మేరకు సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈజిప్ట్, సూడాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు 4 వేల క్వింటాళ్లకు పైగా విత్తనాలు ఎగుమతి అయినట్లు తెలిపారు. ఈ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ఆన్లైన్ విత్తన ధ్రువీకరణ, సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణలపై చేస్తున్న కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బంగ్లాదేశ్ ప్రతినిధి కబీర్ మాట్లాడుతూ తమ దేశంలో కూడా కొత్త విత్తన చట్టం రానున్నదన్నారు.