వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు
ఫేస్‌బుక్ ... మత్తెక్కించి దోచేస్తాడు
Published Mon, Aug 22 2016 7:49 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
పంజగుట్ట: ఫేస్‌బుక్ ద్వారా స్నేహం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన 10 తులాల బంగారు నగలు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పంజగుట్ట ఠాణాలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... మెహిదీపట్నం హుడా కాలనీకి చెందిన రియాజ్ అహ్మద్ అలియాస్ మహ్మద్ యాహ ఉల్ హసన్ అలియాస్ అకిత్ (32) ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాడు. ఇతను ఫేస్‌బుక్‌లో కొద్దిగా అమాయకంగా కనిపిస్తున్న వారి ఫొటోలు ఎంపిక చేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. వారు యాక్సెప్ట్ చేయగానే వారి ఫొటోలకు మంచి కామెంట్లు, లైక్‌లు కొట్టడంతో పాటు ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తూ ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు.
ఫోన్లు చేసి పరిచయం మరింత పెంచుకుం టాడు. తర్వాత ఒక్కసారి పర్సనల్‌గా కలిసి మాట్లాడుకుందామని పిలుస్తాడు. మాటల్లో పెట్టి వారితో మత్తు పదార్థాలు కలిపిన మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్ తాగిస్తా డు. మత్తు వచ్చి పడిపోగానే వారి వద్ద ఉన్న బంగారు నగలు, పర్సులు, ఫోన్, ల్యాప్‌టాప్ తీసుకొని ఉడాయిస్తాడు. ఈ విధంగా నగరంలోని పంజగుట్ట, గచ్చిబౌలి, జవహర్‌నగర్, నేరేడ్‌మెట్ ఠాణాల పరిధిలో మొత్తం నలుగురిని దోచుకున్నాడు. ఈ ఘటనలపై ఆయా ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, చోరీ సొత్తును నిందితుడు సోమవారం విక్రయిస్తుండగా పంజగుట్ట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.ఫేస్‌బుక్‌లో అపరిచితులు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయరాదని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement