ఫేస్‌బుక్‌తో వల.. డ్రగ్స్, సెక్స్ రాకెట్‌లో యువత!
యువతకు డ్రగ్స్, సెక్స్ అలవాటు చేయడానికి ముంబైలో కొంతమంది ఫేస్‌బుక్‌ను దారుణంగా వాడుకుంటున్నారు. వాళ్ల ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ చేసి, అందులో ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం, అందులోని 'కల్ట్'లో చేరడం.. అంతే! ఇంత సులభంగా యువతకు వలవేసి వాళ్లను డ్రగ్స్, సెక్స్ రాకెట్‌లోకి దించుతున్న వైనాన్ని ముంబైకి చెందిన ఇద్దరు యువతుల తల్లిదండ్రులు బాంబే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లిద్దరి వయసు 21, 23 సంవత్సరాలు. ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన వీళ్లు తమ గోడును హైకోర్టుకు చెప్పుకొన్నారు. తమ కుమార్తెలను ఈ గ్యాంగు బారి నుంచి కాపాడి మళ్లీ తిరిగి ఇంటికి చేర్చాలని, దీని వెనక ఉన్న సూత్రధారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సునీల్ కులకర్ణి (55) అనే వ్యక్తి యువతను ఈ రాకెట్‌లోకి లాగుతున్నట్లు తెలిసింది. కులకర్ణి తమ కుమార్తెలను ట్రాప్ చేశాడంటూ వీళ్లతో పాటు మరో జంట కూడా కోర్టును ఆశ్రయించింది. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కోర్టు మండిపడటంతో కులకర్ణిని ఎట్టకేలకు గురువారం అరెస్టు చేశారు. అతడి ఫేస్‌బుక్ పేజీలో రెచ్చగొట్టే ఫొటోలు, లైంగికంగా ప్రేరేపించే మెసేజిలు ఉంటాయి. ఆ గ్రూపులో చేరిన వాళ్లకు డ్రగ్స్ ఇచ్చి, హిప్నటైజ్ చేసి, కులకర్ణితో పాటు మరి కొందరితో సెక్స్‌లో పాల్గొనేలా చేస్తున్నారు. కులకర్ణి తనకు తాను ఒక డాక్టర్‌గాను, సైకియాట్రిస్టు గాను చెప్పుకొంటున్నాడు.
వీళ్ల కార్యకలాపాలలో పాల్గొనడం మొదలుపెట్టిన తర్వాత తమ కుమార్తెల ప్రవర్తన దారుణంగా మారిపోయిందని మలాడ్ దంపతులు చెప్పారు. వాళ్లు చదువులు వదిలేశారని, పోలీసులను ఆశ్రయించాలని తాము భావిస్తుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారని తెలిపారు. చివరకు తాము వాళ్లను తిడుతున్నామని, గృహహింసకు పాల్పడుతున్నామంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు కూడా ఇచ్చారని వివరించారు. 18-25 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలను కులకర్ణి ఆకర్షించి, వాళ్ల బుర్రలను మార్చేస్తున్నాడని, పూర్తిగా తన నియంత్రణలో పెట్టుకుంటున్నాడని తెలిపారు. ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా చేస్తుంటే తాము ఏమైపోవాలని ఆ తల్లిదండ్రులు వాపోయారు.