ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి.. మృగాడి ఆట కట్టించిన మహిళా ఎస్సై | Delhi Woman Sub Inspector Arrested Molestation Accused by Luring Him on Facebook | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి.. మృగాడి ఆట కట్టించిన మహిళా ఎస్సై

Published Mon, Aug 2 2021 7:49 PM | Last Updated on Mon, Aug 2 2021 7:55 PM

Delhi Woman Sub Inspector Arrested Molestation Accused by Luring Him on Facebook - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: నిత్యం ఫేస్‌బుక్‌లో గడపడమే అతగాడి పని. అమ్మాయి పేరు మీద ఎఫ్‌బీ అకౌంట్‌ కనిపిస్తే చాలు.. అతడి చేతులు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ని పంపిస్తాయి. దురదృష్టం కొద్ది అవతలి వైపు అమ్మాయి ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్‌ చేసిందంటే.. ఇక ఆమె జీవితం నాశనం అయినట్లే. మెల్లగా మాటలు చెప్పి.. ప్రేమిస్తున్నాంటూ నమ్మబలికి.. యువతిని లోబర్చుకుంటాడు. అవసరం తీరాక ముఖం చాటేస్తాడు. ఆ తర్వాత కాంటాక్ట్‌ చేయడానికి ఎలాంటి సమాచారం ఉండదు.

కొంతకాలంగా ఇలా అడ్రెస్‌లు మార్చి.. యువతులను ఏమారుస్తున్న మృగాడికి విభిన్న రీతిలో బుద్ధి చెప్పింది మహిళా పోలీసు అధికారి. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా.. నిందితుడి దారిలోనే వెళ్లి.. ఫేస్‌బుక్‌ వేదికగా వల వేసి పట్టుకున్నారు. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు..

ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలికకు నిందితుడు అవినాష్‌ ఫేస్‌బుక్‌లో పరియచం అయ్యాడు. ముందు మంచిగా నటిస్తూ.. ప్రేమించానని నమ్మబలికాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి నిందితురాలిని పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో అతడి కారణంగా గర్భం దాల్చిన బాధితురాలు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అమ్మాయి అత్యాచారానికి గురయిందని గుర్తించారు. ఈ క్రమంలో సదరు మైనర్‌ బాలిక, అవినాష్‌ దారుణాల గురించి పోలీసులకు తెలిపింది. ఇక అతడు ఎక్కడుంటాడు.. కుటుంబ వివరాలేవి తనకు తెలియదని చెప్పింది. అతడి ఫోన్‌ నంబర్‌ కూడా పని చేయడం లేదని వెల్లడించింది. నిందితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాన్ని చేధించేందుకు ఫేస్‌బుక్‌నే ఎన్నుకున్నారు.

ఈ క్రమంలో అవినాష్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో సర్చ్‌ చేశారు. అలా వచ్చిన అకౌంట్లలో ఓ దానిలో బాధితురాలితో కలిసి ఉన్న ఓ వ్యక్తి అకౌంట్‌ వారికి కనిపించింది. బాధితురాలిని పిలిచి దాన్ని చూపించగా.. అతడే అవినాష్‌ అని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళా ఎస్సై సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల్ని మోసం చేస్తున్న అవినాష్‌కు, దాని ద్వారానే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతడిని సాక్ష్యాలతో పట్టుకోవాలని అదే దారిని ఎంచుకున్నారు.

ఓ నకిలీ ప్రొఫైల్ క్రియోట్ చేసిన మహిళా ఎస్ఐ.. నిందితుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. సాధారణంగా అమ్మాయిలంటే పడిచచ్చేపోయి నిందితుడు.. వెంటనే ఎస్సై ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి కొద్ది రోజుల పాటు వాడితో చాటింగ్‌ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా అవినాష్‌ ఫోన్‌ నంబర్‌ సంపాదించింది. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలుద్దామని చెప్పి.. ఓ ప్రదేశానికి రావాలని కోరింది మహిళా ఎస్సై. తాను చెప్పిన ప్రదేశానికి రాగానే అవినాష్‌ను అరెస్ట్‌ చేసింది.

పోలీసుల విచారణలో నిందితుడు పలు విషయాలను వెల్లడించాడు. పదిహేను నెలల్లో ఆరుగురిపై లైంగిక దోపిడీకి పాల్పడినట్టు చెప్పాడు. అందుకే తన అడ్రస్ దొరకకుండా తరచూ ఇళ్లు మారుతుంటానని పేర్కొన్నాడు. అమ్మాయిలకు నకిలీ పేర్లు చెప్పి పరిచయం పెంచుకుని శారీరక వాంఛ తీరిన తర్వాత వదిలేస్తానని అంగీకరించాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement