భద్రత విధుల నుంచి తప్పించిన హెచ్‌ఎండీఏ
లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్లలో {పైవేటు సైన్యం
సిటీబ్యూరో: పర్యాటకులు, సందర్శకులతో నిత్యం కిటకిటలాడే లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న మాజీ సైనికులకు ఉద్వాసన పలుకుతూ హెచ్‌ఎండీఏ తాజాగా నిర్ణయం తీసుకొంది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధలో పనిచేస్తున్న 23మంది మాజీ సైనికులను వెనక్కి పంపుతూ బీపీపీ అర్బన్ ఫారెస్ట్రీ డెరైక్టర్ సోమవారం సైనిక్ వెల్ఫేర్ బోర్డుకు లేఖ రాశారు. ఈమేరకు మంగళవారం నుంచి మాజీ సైనికుల సేవలు అవసరం లేదని అందులో పేర్కొన్నారు. అవసరానికి మించి మాజీ సైనికులు బీపీపీలో భద్రత విధులు నిర్వహిస్తుండటంతో పాటు వీరికి అధికంగా వేతనాలు చెల్లించాల్సి వస్తోందన్న ఉద్దేశంతో వీరిని తప్పించేందుకు 2013 నవంబర్‌లో హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఉన్నఫళంగా తొలగించకుండా నెల రోజులు గడువు ఇస్తూ ముందుగా నోటీసులు జారీ చేసింది. దీంతో హెచ్‌ఎండీఏ తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకొని రెండేళ్లుగా కొనసాగుతున్నారు. ఈ కేసు గత సెప్టెంబర్‌లో విచారణకు రాగా హెచ్‌ఎండీఏ తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాజీ సైనికుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇటీవలే హెచ్‌ఎండీఏకు అందడంతో వాటిని అమలు చేస్తూ సోమవారం అధికారులు చర్యలు తీసుకొన్నారు. అయితే... మాజీ సైనికులను భద్రత విధుల నుంచి తప్పిస్తూ హెచ్‌ఎండీఏ అధికారులు తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీతో పాటు సుశిక్షితులైన ఎక్స్‌సర్వీస్ మెన్లను కొనసాగిస్తేనే లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్ల వద్ద ప్రయోజనం ఉంటుందనీ... లేదంటే నిఘా కట్టుతప్పి అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉందని పోలీసు మాజీ అధికారులు హెచ్చరిస్తున్నారు. సిబ్బందిని తగ్గించుకోవాలన్న హెచ్‌ఎండీఏ ప్రయత్నాన్ని మాజీ సైనికులు సవాల్ చేస్తూ గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, ఆ కేసులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని బీపీపీ అర్బన్ ఫారెస్ట్రీ డెరైక్టర్ స్వర్గం శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు కోర్టు ఉత్తర్వులను అమలు చేశామే తప్ప కొత్తగా వారిపై చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. కాగా విద్యా సంవత్సరం మధ్యలో తమను ఉద్యోగం నుంచి తప్పించడంపై మాజీ సైనికోద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆరోగ్యం వంటివి తమ ఉద్యోగాలతో ముడిపడి ఉన్నాయని కన్నీళ్లపర్యంతమవుతున్నారు.
మాజీ సైనికులకు ఉద్వాసన !
Published Mon, Nov 23 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM
Advertisement