మాజీ సైనికులకు చుక్కెదురు !
హెచ్‌ఎండీఏ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ)లో సెక్యూరిటీ (భద్రత) విధులు నిర్వహిస్తున్న మాజీ సైనికులకు హైకోర్టులో చుక్కెదురైంది. తమ సర్వీసులను ఉపసంహరిస్తూ హెచ్‌ఎండీఏ తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు మాజీ సైనికులు (ఎక్స్ సర్వీస్‌మెన్లు) దాఖలు చేసిన పిటీషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేస్తూ హెచ్‌ఎండీఏ తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోన్న ఎక్స్ సర్వీస్‌మెన్లకు ఉద్వాసన పలకాలని 2013 నవంబర్‌లో హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.
ఆమేరకు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న 27మంది మాజీ సైనికులను డిసెంబర్ 15లోగా వెనక్కి తీసుకోవాలని కోరుతూ సైనిక్ వెల్ఫేర్ బోర్డుకు లేఖరాసింది. దీంతో మాజీ సైనికులు ఉన్నతాధికారులను కలిసి 5 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఉన్నపళంగా తొలగించడం సబబు కాదని, వదీనిపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అయినా వారు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో సీఎస్‌ఓ విష్ణువర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మాజీ సైనికులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వారిని తొలగించవద్దని హెచ్‌ఎండీఏను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో హెచ్‌ఎండీఏ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత వాయిదాలు పడుతూ వస్తోన్న కే సు మంగళవారం మరోసారి విచారణకు రాగా హెచ్‌ఎండీఏ నిర్ణయాన్ని సమర్ధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆందోళనలో మాజీ సైనికులు:
బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తోన్న తమను ఆకస్మికంగా తొలగిస్తారన్న విషయాన్ని మాజీ సైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ జీవితాలు రోడ్డుపై పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పరిస్థితిని అర్థం చేసుకొని తమ సేవలు మరికొంతకాలం వినియోగించుకోవాలని కోరుతున్నారు.