గ్రీన్‌హౌస్ వ్యయం ఎకరాకు రూ.2 లక్షలు తగ్గింపు | Farmer reaps rich with greenhouse technology | Sakshi
Sakshi News home page

గ్రీన్‌హౌస్ వ్యయం ఎకరాకు రూ.2 లక్షలు తగ్గింపు

Published Tue, Jun 23 2015 1:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

గ్రీన్‌హౌస్ వ్యయం ఎకరాకు రూ.2 లక్షలు తగ్గింపు - Sakshi

గ్రీన్‌హౌస్ వ్యయం ఎకరాకు రూ.2 లక్షలు తగ్గింపు

గ్రీన్‌హౌస్ (పాలీహౌస్) నిర్మించుకునే రైతులకు శుభవార్త. గ్రీన్‌హౌస్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తగ్గించాలని...

సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ (పాలీహౌస్) నిర్మించుకునే రైతులకు శుభవార్త. గ్రీన్‌హౌస్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తగ్గించాలని సర్కారు యోచిస్తోంది. దీనిపై ఏర్పాటైన కమిటీ పలు సూచనలు చేసింది. గ్రీన్‌హౌస్ ఎత్తును 7.5 మీటర్ల నుంచి 6.5 మీటర్లకు తగ్గించడంతో నిర్మాణ పరికరాలు తక్కువ అవసరమవుతాయని.. తద్వారా వ్యయం తగ్గుతుందని కమిటీ పేర్కొంది. దీనివల్ల ఎకరాకురూ. 2 లక్షల వరకు భారం తగ్గుతుందని తెలిపింది.

దీంతో 75 శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వానికి రూ.1.5 లక్షలు, 25 శాతం చెల్లించే రైతుకు రూ.50 వేల మేరకు ధర తగ్గుతుందని ప్రతిపాదించింది. దీన్ని పరిశీలించి త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
 
మందకొడిగా సాగుతున్నందునే...
ప్రభుత్వం గత ఏడాది నుంచి గ్రీన్‌హౌస్ ప్రాజెక్టును చేపట్టింది. అందుకోసం రూ. 250 కోట్లు కేటాయించింది. దీనిద్వారా వెయ్యి ఎకరాల్లో గ్రీన్‌హౌస్ సాగును ప్రోత్సహించాలని లక్ష్యం గా పెట్టుకుంది. గ్రీన్‌హౌస్ నిర్మించుకునే రైతులకు 75 శాతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అంతే మొత్తంలో నిధులు కేటాయించింది. దాంతోపాటు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల పరిధిని ఎత్తివేసి రాష్ట్రంలో ఎక్కడైనా గ్రీన్‌హౌస్ విధానంలో సాగు చేసేందుకు రైతులకు అనుమతించింది.

అయినా నిబంధనలు కఠినంగా ఉన్నాయన్న కారణంతో గ్రీన్‌హౌస్ నిర్మాణం చేపట్టేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. పైగా యూనిట్ ధర అధికంగా ఉండటంతో రైతులు కూడా ఆసక్తి కనబరచడంలేదు. దీంతో ఇప్పటివరకు ఎక్కడా గ్రీన్‌హౌస్ నిర్మాణం పూర్తయి సాగు జరుగుతున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నిబంధనల్లో అనేక సడలింపులు చేయాలని సర్కారు యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రీన్‌హౌస్ ఎత్తు 6.5 మీటర్లు ఉండగా, రాష్ట్రంలో అది 7.5 మీటర్లు ఉండాలని నిర్ణయించారు. దీంతో పొడవైన పరికరాలు కూడా అందుబాటులో ఉండటంలేదు.

వ్యయం అధికం, పరికరాలు అందుబాటులో ఉండని కారణంగా ఎత్తును 6.5 మీటర్లకు తగ్గించాలని సాంకేతిక కమిటీ తాజాగా ప్రతిపాదించింది. దీనివల్ల నిర్మాణ వ్యయం ఎకరాకురూ. 2 లక్షలు తగ్గుతుందని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఎకరాకు నిర్మాణ వ్యయం రూ. 33.76 లక్షలుండగా, మొక్కలు, ఇతరత్రా మెటీరియల్ ధర రూ. 5.60 లక్షలు ఉంది.

మొత్తంగా ఎకరాకు రూ. 39.36 లక్షలవుతోంది. కొత్త ప్రతిపాదన ప్రకారం రూ.2 లక్షలు తగ్గిస్తే అదికాస్తా రూ.37.36 లక్షలు అవుతుంది. దీంతోపాటు మరికొన్ని నిబంధనలనూ సడలించాలని యోచిస్తోంది. ఏదేమైనా గ్రీన్‌హౌస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ఉద్యానశాఖ చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement