ఉల్లంఘనులపై కొరడా | Fear drives defaulters to pay fines | Sakshi
Sakshi News home page

ఉల్లంఘనులపై కొరడా

Published Tue, Mar 17 2015 3:27 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

ఉల్లంఘనులపై కొరడా - Sakshi

ఉల్లంఘనులపై కొరడా

మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారా? చలానా కట్టాల్సి ఉందా? ‘ఇది చెల్లించకపోయినా ఏం కాదులే’ అనే ధీమాతో ఉన్నారా? ఆ భ్రమ నుంచి బయటకు రండి. తక్షణమే చలానా చెల్లించండి. లేదంటే కోర్టు మెట్లు ఎక్కాల్సి రావచ్చు. శిక్షకు గురికావచ్చు. అవును...పెండింగ్ చలానాదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. చార్జిషీట్లు తెరుస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా సోమవారం సంబంధిత వ్యక్తులకు జరిమానా విధించారు.
 
- పెండింగ్ చలానాలపై ట్రాఫిక్ పోలీసుల దృష్టి
- 43 మందిపై చార్జిషీటు
- కోర్టుకు హాజరైన వాహనదారులు
- మొదటిసారి జరిమానాతో సరి
- దేశంలోనే తొలిసారి
- భవిష్యత్తులో జైలు శిక్ష విధించే అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి... చలానాలు చెల్లించకుండా తిరుగుతున్న వారికి ఇక గడ్డు రోజులే. ఇలాంటి వారు మేలుకోకపోతే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇలా చలానాలు చెల్లించని 43 మంది వాహనదారులకు ఎర్రమంజిల్ కోర్టు సోమవారం రూ.73,800 జరిమానా విధించింది. మొదటి తప్పిదంగా రూ.500 నుంచి రూ.3,700 వరకు జరిమానా విధిస్తూ 3వ మెట్రో పాలిటన్ ఇన్‌చార్జి మెజిస్ట్రేట్ (రైల్వే కోర్టు మెజిస్ట్రేట్) ఎం.రాజు, 4వ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ శివశంకర్‌ప్రసాద్ తీర్పునిచ్చారు.

ఆసీఫ్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారికి అత్యధికంగా రూ.3,700 జరిమానా పడింది. జరిమానా చెల్లించాల్సిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు. పదిపైన పెండింగ్ చలానాలు ఉన్న వాహదారులపై చార్జిషీట్ పెట్టారు. రానున్న రోజుల్లో మూడు చలానాలు పెండింగ్ ఉన్నా... చార్జిషీట్ పెట్టి... వాహనదారుని కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ డీసీపీ రంగనాథన్ తెలిపారు. వీటిని వెంటనే చెల్లించాలని... లేని పక్షంలో డ్రంకన్‌డ్రైవ్ కేసుల తరహాలోనే వ్యవహరిస్తామని హెచ్చరించారు.
 
ఇదే  మొదటిసారి...

చలానాలు పెండింగ్‌లో ఉన్న వారిని కోర్టులో హాజరుపరచడం దేశ చరిత్రలోనే మొదటిసారి. సిగ్నల్ జంపింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, నోపార్కింగ్, నో ఎంట్రీ వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారికి గతంలో ట్రాఫిక్ పోలీసులు చలానా విధించేవారు. సంబంధిత మొత్తం చెల్లిస్తే వాహనాన్ని వదిలిపెట్టేవారు. లేదంటే వాహనాన్ని సీజ్ చేసి ఠాణాకు తరలించేవారు. దీనివల్ల వాహనదారులు, పోలీసు అధికారుల మధ్య వివాదాలు తలెత్తేవి. దీన్ని నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు నగరంలోని సుమారు 350 చౌరాస్తాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బందికీకెమెరాలు అందించారు.వీటి ద్వారా ఉల్లంఘనులను గుర్తించి, వారి చిరునామాకు ఈ-చలానా కాపీలను పంపించేవారు.
 
రికవరీకి యత్నాలు

ఇలా 2009 నుంచి ఇప్పటి వరకూ చలానా బారిన పడిన వారి సంఖ్య 45 లక్షలు. వీరి నుంచి రావాల్సిన మొత్తం సుమారు రూ.60 కోట్లు ‘పెండింగ్’లో ఉండిపోయాయి. వీరిలో మూడు... ఆపైన చలానాలు బకాయి ఉన్న వారు సుమారు 20 లక్షలు. కనీసం వీరి నుంచైనా రికవరీ మొదలు పెట్టాలని అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ మూడు నెలల క్రితం నిర్ణయించారు. వాహనదారులు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆన్‌లైన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ-సేవ, మీ-సేవ, ట్రాఫిక్ కాంపౌండింగ్‌బూత్‌లలో సౌకర్యం కల్పించారు. జైలుకు వె ళ్లాల్సి వస్తుందని హెచ్చరించడంతో సుమారు 25 లక్షల మంది చలానాలు చెల్లించారు. మిగిలిన వారు స్పందించలేదు.
 
ఇదీ పరిస్థితి
పెండింగ్ చలానాల కోసం త్వరలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
చార్జిషీట్ దాఖలు చేసినా కోర్టుకు రాని వాహనదారుడికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది.
అదే జరిగితే పోలీసులు అరెస్టు చేసి... కోర్టులో హాజరుపర్చాల్సి వస్తుంది.
ప్రస్తుతం నోటీసు ద్వారానే వాహనదారులు కోర్టుకు హాజరవుతున్నారు.
 పెండింగ్ చలానాలు ఇలా....
 ఒకటి నుంచి మూడు వరకూ బకాయి ఉన్నవాహనదారులు 16,24,270 మంది
 4  5 ....  1,97,058
 6  10 ....     1,26,730
 11పైన...     39,471
 
పాస్‌పోర్టు, జాబ్ వెరిఫికేషన్‌కు ఇబ్బందులు తప్పవు
పెండింగ్ చలానా విషయంలో కోర్టు శిక్ష విధిస్తే సంబంధిత వ్యక్తుల పాస్‌పోర్టు, విసా, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల వెరిఫికేషన్‌కు ఇబ్బందులు తప్పవు. చట్ట ప్రకారం స్పెషల్ బ్రాంచ్ అధికారులు తమ విచారణలో ఉన్న అంశాలను సంబంధిత సర్టిఫికెట్లలో ప్రస్తావించాల్సి ఉంటుంది.
 - నాగిరెడ్డి జాయింట్ సీపీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement