సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలు అలాగే ఉండిపోయాయని, వాటి పరిష్కారానికి ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ తెలిపారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్ హెచ్‌యూజే ఆధ్వర్యంలో ఈ నెల 22న చేపట్టే ‘చలో కలెక్టరేట్’ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార రాజకీయ పక్షం జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎన్నికల ప్రణాళికలో ఉంచినా ఏ ఒక్కటీ అమ లు పరచటం లేదన్నారు. అందుకే ఓపిక నశించి ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సోదరులందరూ చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు అందే విధంగా జీఓ 239 సవరించి, తక్షణమే కొత్త రాష్ట్రం అక్రెడిటేషన్లు జారీ చేయాలన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలో హెల్త్ స్కీము అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్న సీఎం హామీని తక్షణం అమలు చేయాలని కోరారు. ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సబ్ ఎడిటర్లకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చే యాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంకా ఆంధ్రా అక్రెడిటేషన్లే కొనసాగుతున్నాయని చెప్పారు. అనంతరం ప్రచార కరపత్రాలను విరాహత్ అలీ విడుదల చేశారు. హెచ్‌యూజే ప్రధాన కార్యదర్శి వి. చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, హెచ్‌యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. శంకర్ గౌడ్, సహయ కార్యదర్శి కోన సుధాకర్ రెడ్డి నాయకులు సంపత్, గౌస్, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.